ప్రజలకు ఉచితాలు ఇవ్వడం బెటరే. కానీ.. ప్రస్తుతం ఈ ఉచితాల కారణంగానే రాష్ట్రం అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్ హయాంలో ఉచితాలు.. బటన్ నొక్కుళ్ల కారణంగానే.. 4 లక్షల కోట్ల రూపా యల వరకు అదనంగా అప్పులు చేయాల్సి వచ్చింది.
ఇది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచింది. ఉచిత పథకాలు పొందిన వారు కూడా.. తమ కుటుంబంలో ఉద్యోగాలు వస్తే బాగుండనని.. అమరావతి రాజధాని ఏర్పాటు చేస్తే.. బాగుంటుందని భావించారు.
మరీ ముఖ్యంగా రహదారుల బాగుచేత, మౌలిక సదుపాయాల కల్పన వంటివి ప్రజలు ఎక్కువగా కోరుకు న్నారు. కానీ, జగన్ హయాంలో మాత్రం కేవలం ఉచిత పథకాలకే ప్రాధాన్యం ఇచ్చి.. వాటిని అమలు చేశారు.
ఇది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారడంతోపాటు.. ప్రజల్లోనూ ఈ పథకాలు దక్కనివారు అసంతృప్తికి గురయ్యేలా చేసింది. వెరసి మొత్తంగా.. వైసీపీ పై వ్యతిరేకత పెంచేలా చేసింది. ఓటు బ్యాంకు 37-39 శాతాల మధ్య ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఏర్పాటు చేయలేక పోయారు.
దీనిని నిశితంగా గమనిస్తున్న సీఎం చంద్రబాబు.. తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటున్నారు. మరోవైపు.. దేశంలోనూ వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు.. ఉచితాలకు కోత పెడుతున్నాయి.
కర్ణాటకలో నిన్న మొన్నటి వరకు అందరు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సేవలు అందించిన సిద్దరామయ్య ప్రభుత్వం.. ఏప్రిల్ 1 నుంచి కేవలం ఉద్యోగినులు, వైట్ రేషన్ కార్డు ఉన్న వారి కుటుంబాలకు మాత్రమే దీనిని అమలు చేయాలని భావిస్తోంది. దీనికి కారణం ప్రభుత్వంపై ఆర్థిక భారం పడడమే.
ఇక, తెలంగాణలోనూ.. రైతు భరోసా నిధులు ఇప్పటికీ ఇవ్వలేక పోతున్నారు. రుణ మాఫీ సగమే చేశారు. ఇలా.. ప్రభుత్వాలు ఉచితాలపై చేస్తున్న స్వారీ బెడిసి కొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు.. ఉచితాలకు ప్రాధాన్యం ఇస్తూనే.. మరోవైపు.. మెజారిటీనిధులను మౌలిక సదుపాయాల కల్పనకు, ఉపాధి, ఉద్యోగాల కల్పనకు వెచ్చించడం ద్వారా.. ప్రజల మనసులను మార్చే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై త్వరలోనే ప్రత్యేక ప్రచారం చేయనున్నారు. మరి దీనిని ప్రజలు ఆహ్వానిస్తారో .. లేదో చూడాలి.