జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… దాన గుణంలో ఎప్పుడూ ఆదర్శంగానే ఉంటారు. రైతులు అయినా… వరద బాధితులు అయినా… అగ్ని ప్రమాద బాధితులు అయినా… జాలర్లు అయినా… ఆపదలో ఉన్న ఇతర వర్గాలు ఏవైనా గానీ.. తనకు సమస్య తెలిసినంతనే పవన్ అక్కడ దిగిపోతారు.
ప్రభుత్వాలే సాయం చేయాలన్న మాటను పక్కనపడేసి… తనకు తోచిన మొత్తాన్ని సాయంగా అందిస్తూ వారికి భరోసాగా నిలుస్తూ ఉంటారు. ఆ స్వభావమే పవన్ ను రియల్ లైఫ్ హీరోగా నిలుపుతోంది.
తాజాగా తనలోని ఈ దాన గుణాన్ని పవన్ మరోమారు నిరూపించుకున్నారు. శనివారం రాత్రి విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యూఫోరియా మ్యూజికల్ నైట్ పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమం జరిగింది.
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ కార్యక్రమం ద్వారా వచ్చే మొత్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ వినియోగించనుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రత్యేక పర్యవేక్షణలో కొనసాగింది.
ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటుగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మంత్రి నారా లోకేశ్ తో పాటు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. మూడు రోజుల ధర్మ పరిరక్షణ యాత్రను ముగించుకున్న పవన్… తమిళనాడు నుంచి నేరుగా విజయవాడ చేరుకున్నారు.
విజయవాడ చేరుకున్నంతనే ఆయన ట్రస్ట్ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతేకాకుండా తలసేమియా వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమం గురించి తెలుసుకున్న పవన్… అక్కడికక్కడే తన వంతుగా రూ.50 లక్షల విరాళాన్ని ట్రస్ట్ కు అందజేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates