ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో సరికొత్త ప్రణాళికను సిద్ధం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని నిర్ణయించారు. అమరావతి విశిష్టత, అభివృద్ధి వంటివి ప్రపంచవ్యాప్తంగా వీరి ద్వారా ప్రచారం చేయించనున్నారు.
దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. బ్రాండ్ అంబాసిడర్లను ఏర్పాటు చేయడం ద్వారా.. అమరావతిని ప్రపంచ స్థాయిలో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు.
తద్వారా.. రాజధానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడంతోపాటు.. విద్యాసంస్థలను, విదేశీ సంస్థలను కూడా ఆకర్షించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. నిజానికి ఇప్పటికే దీనికి సంబంధించి ప్రపంచ స్థాయిలో పలు దేశాల పత్రికలు, మీడియాకు ప్రకటనలు ఇస్తున్నారు.
అయినప్పటికీ.. మరింత జోష్ పెంచేలా తాజాగా బ్రాండ్ అంబాసిడర్ల నియామకంపై కసరత్తు చేసిన చంద్రబాబు ఆదిశగా కీలక అడుగులు వేశారు.
బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించే వారు.. అభివృద్ధి, సాంకేతికత, సమాజ సేవ, సామాజిక బాధ్యత వంటి రంగాల్లో ప్రపంచవ్యాప్త గుర్తింపు కలిగి ఉండాలి. బ్రాండింగ్ విషయంలో ప్రతిభ కలిగినవారై ఉండాలి.
అమరావతి అభివృద్ధిపై అంకితభావం, నిబద్ధత, స్థానిక ప్రజలతో మమేకమైనవారై ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తులను సీఆర్‌డీఏ పరిశీలించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనుంది.
బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపికయ్యేవారి పదవీ కాలం ఏడాదిగా నిర్ణయించారు. అయితే.. బ్రాండ్ అంబాసిడర్ల నియామకం పూర్తిగా సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే జరగనుంది. ఈ క్రమంలో రాష్ట్రానికి ఒకరు చొప్పున ఎంపిక చేయడం ద్వారా దేశంలోనూ.. ప్రపంచ స్థాయిలో మరికొందరిని ఎంపిక చేసి వారి ద్వారా కూడా ప్రచారం చేయనున్నారు.
భారత దేశంలోనే మేటి నగరంగా అమరావతిని నిర్మించాలన్న చంద్రబాబు లక్ష్యం ఈ విధంగా మరింత పుంజుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.