వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ తొలిసారిగా స్పందించారు. శనివారం విశాఖ వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన సమయంలో మీడియా ప్రతినిధులు ఈ విషయంపై ఆయన స్పందనను కోరారు.
దీంతో వంశీ అరెస్టుపై స్పందించిన లోకేశ్… అంతా చట్టబద్ధంగానే జరుగుతోందని, చట్ట ప్రకారమే తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇందులో ఎలాంటి సందేహాలకు తావు లేదని కూడా ఆయన వెల్లడించారు.
వైసీపీ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిందని లోకేశ్ గుర్తు చేశారు. ఆ తర్వాత గన్నవరంలోని పార్టీ కార్యాలయంపైనా దాడి జరిగిందన్నారు. ఇలా అనునిత్యం టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం, తమపై దాడులు చేయడం వైసీపీ పనిగా పెట్టుకుని పాలన సాగించిందని ఆరోపించారు.
ఈ దాడులను చూసి.. ఆనాడే తాను ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు ఓ మాటిచ్చానని లోకేశ్ గుర్తు చేశారు. చట్ట వ్యతిరేకంగా అరెస్టులు, దాడులకు పాల్పడ్డ వైసీపీ శ్రేణులతో పాటుగా అదికారులను చట్టానికి లోబడి శిక్షిస్తామని తన యువగళం పాదయాత్ర బహిరంగ సభల్లో చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. ఆ మేరకే ఇప్పుడు తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని కూడా లోకేశ్ చెప్పుకొచ్చారు.
టీడీపీ గన్నవరం కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి ఫిర్యాదు చేసిన దళిత యువకుడిపై బెదిరింపులకు పాల్పడి… కేసును విత్ డ్రా చేసుకునేలా మాజీ ఎమ్మెల్యే వ్యవహరించారని లోకేశ్ ఆరోపించారు. ఈ వ్యవహారం బయటపడిన కారణంగానే…చట్టబద్దంగా తప్పు చేసిన వారిపై కేసు నమోదు చేశామని, అందులో బాగంగానే అరెస్టు జరిగిందని ఆయన తెలిపారు.
ఈ వ్యవహారంలో అన్ని నిజాలను బయటకు తీస్తామని చెప్పిన లోకేశ్… ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే,… ఈ కేసుపై మాట్లాడినంత సేపు లోకేశ్ నోట నుంచి వంశీ పేరు ప్రస్తావనకే రాకపోవడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే అని ఒక్కసారి మాత్రమే ప్రస్తావించిన లోకేశ్… వంశీ పేరును పలికేందుకు కూడా ఇష్టపడలేదని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates