వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిత్యం కూటమి సర్కారుపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. నోరు తెరిస్తే సూపర్ సిక్స్ హామీల అమలు ఎక్కడ అంటూ ఆయన కూటమి సర్కారును నిలదీస్తున్నారు. అయితే కూటమి నేతలు కూడా అంతే స్థాయిలో జగన్ కు బదులిస్తున్నారు.
జగన్ చేసిన విధ్వంసం కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆదిలోనే చెప్పిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు…ఆర్థిక పరిస్థితి చక్కదిద్ది సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని చెబుతున్నారు.
తాజాగా బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఏపీ శాఖకు అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు శనివారం జగన్ తీరుపై ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియా ముందుకు వచ్చిన వీర్రాజు… ఎన్నికలకు ముందు కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతుందని చెప్పారు.
సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే బాధ్యత కూటమి సర్కారుదేనని…ఈ విషయంలో ఏ ఒక్కరికి అనుమానాలు అవసరం లేదని తెలిపారు. జగన్ కు కూడా ఈ విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదని కూడా ఆయన ఒకింత ఘాటుగానే స్పందించారు.
అయినా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయమని డిమాడ్ చేసే హక్కే జగన్ కు లేదని కూడా వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి సంపూర్ణంగా తెలిసిన జగన్…తక్షణమే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని ఎలా డిమాండ్ చేస్తారని ప్రశ్నించారు.
తానేదో బటన్ లు నొక్కానని చెబుతున్న జగన్.. ఆ బటన్ నొక్కుడు జనానికి నచ్చి ఉంటే… జగన్ పార్టీకి 11 సీట్లే ఎందుకు వచ్చాయని కూడా వీర్రాజు అదిరేటి సెటైర్ వేశారు. అయినా మాట తప్పను, మడమ తిప్పను అంటూ ప్రగల్భాలు పలికే జగన్.,. ఎన్నికల్లో ఎందుకు విఫలమయ్యారని వీర్రాజు ప్రశ్నించారు.