టీడీపీ సీనియ‌ర్ నేత‌పై హైద‌రాబాదులో క్రిమిన‌ల్ కేసు

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డిపై హైద‌రాబాద్ పోలీసులు క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి మునిసిప‌ల్ చైర్మ‌న్‌గా ఉన్న ప్ర‌భాక‌ర్‌రెడ్డి.. బీజే పీ నాయ‌కురాలు..మాధ‌వీల‌త‌పై నోరు చేసుకున్నారు. ఈ క్ర‌మంలో మాధ‌వీల‌త కొన్నాళ్ల కింద‌ట ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు తాజాగా హైద‌రాబాద్ పోలీసులు కేసు పెట్టారు. వాస్త‌వానికి మాధ‌వీల‌త పోక్సో కేసు పెట్టాల‌ని కోరిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, క్ర‌మిన‌ల్ కేసు న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది?

గ‌త‌ ఏడాది డిసెంబ‌రు 31న నూతన సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను జేసీ త‌న ఫామ్ హౌస్‌లో ఘ‌నంగా ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు యువ‌తుల‌ను కూడా తీసుకువ‌చ్చారు. దీనిపై స్పందించిన మాధ‌వీ ల‌త‌.. మ‌హిళ‌ల‌తో అస‌భ్య‌క‌ర నృత్యాలు చేయించారంటూ.. అప్ప‌ట్లోనే జేసీపై విమ‌ర్శ‌లు చేశారు. తాడిప‌త్రిలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని.. ఇలాంటి నృత్యాల‌తో మ‌హిళ‌ల ప‌రువు తీస్తున్నార‌ని ఆమె నిప్పులు చెరిగారు.

దీనిపై ఆ వెంట‌నే జేసీ స్పందించారు. మాధ‌వీ ల‌త‌పై నోరు చేసుకున్నారు. దూషించారు. ఈ వివాదం తార‌స్థాయికి చేరింది. దీంతో చివ‌ర‌కు.. జేసీ మ‌రోసారి మీడియా ముందుకు వ‌చ్చి మాధ‌వీల‌త‌కు క్ష‌మాప ణ‌లు చెప్పారు. పొర‌పాటున తాను ప‌రుషంగా వ్యాఖ్యానించాన‌ని చెప్పారు. అయితే.. అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌సాంతంగానే సాగిపోయినా.. త‌ర్వాత ఏపీకి చెందిన ఓ పార్టీ కీల‌క నేత ఒక‌రు రంగంలోకి దిగి.. జేసీపై కేసు పెట్టేందుకు పురిగొల్పార‌న్న‌ది ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ‌.

ఈ క్ర‌మంలోనే తాజాగా హైద‌రాబాద్లోని సైబ‌ర్ క్రైం పోలీసులు భార‌తీయ‌న న్యాయ సంహిత సెక్ష‌న్లు 351, 352 కింద జేసీపై కేసు న‌మోదు చేశారు. ఇవి క్రిమిన‌ల్ చ‌ట్టాల‌ని న్యాయ‌నిపుణులు చెబుతున్నారు. దీనిపై ఎఫ్ ఐఆర్ కూడా న‌మోదు కావ‌డంతో పోలీసులు ఆయ‌న‌కు 41 ఏ కింద నోటీసులు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఆయ‌న వివ‌ర‌ణ తీసుకున్న త‌ర్వాత‌.. అరెస్టు చేసినా చేయొచ్చ‌ని అంటున్నారు.