ఏపీలో మూడు శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవి ఉపాధ్యాయ, పట్టభద్ర స్థానాలు కావడంతో రాజకీయ పార్టీలకు నేరుగా ప్రమేయం లేదు. అయినప్పటికీ.. రాజకీయ నేతలే ఈ ఎన్నికల్లో తల పడుతున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మినహా..మిగిలిన రెండు నియోజకవర్గాలు కూడా.. పట్టభద్రులకు సంబంధించినవి. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్ర స్థానం, ఉమ్మడి గుంటూరు, కృష్ణాజిల్లాలకు చెందింది మరోస్థానం.
ఈ రెండు కూడా.. టీడీపీ నాయకులే పోటీ చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు-కృష్ణాలో మాజీ మంత్రి ఆలపా టి రాజేంద్రప్రసాద్, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పేరాబత్తుల రాజశేఖరం బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున.. వీరే కనిపిస్తున్నారు. మిగిలిన వారిలో చాలా మంది స్వతంత్రులు. ఒకరిద్దురు మాత్రం చిన్నా చితకా పార్టీల మద్దతుతో బరిలో ఉన్నారు. ఇక, ప్రతిపక్షం వైసీపీ మాత్రం ఈ ఎన్నికలకు కడు దూరంలో నిలిచింది. అంటే.. ఒక రకంగా ప్రస్తుతం ఉన్న వారి మధ్య పోటీ ఉండే అవకాశం లేదు.
దీంతో టీడీపీ అభ్యర్థులు.. ఆలపాటి, పేరాబత్తుల విజయంపై తమ్ముళ్లు ముందుగానే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక, నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది. దీంతో ప్రచారంపై నాయకులు దృష్టి పెట్టారు. ఇతర ఎన్నికల మాదిరిగా కాకుండా.. కేవలం పట్టభద్రులు మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. వీరిని ఆకర్షించేందుకు.. ఆకట్టుకునేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఈ క్రమంలో ఉమ్మడిగా కూటమి నాయకులు ఎక్కడా కనిపించడం లేదు.
మరోవైపు.. సీఎం చంద్రబాబు ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలపై తనదైన అంచనాలను వేసుకున్నారు. నాయకులు అందరూ.. కదలి రావాలని, కలసి రావాలని కూడా సూచిస్తున్నా.. పెద్దగా ఎవరూ పట్టించుకో వడం లేదు. దీంతో టీడీపీ అభ్యర్థుల గెలుపుపై అనేక సందేహాలు ముసురుకుంటున్నాయి. బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ.. టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పైగా ప్రజల్లో పథకాల అమలుపై ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ఈ ప్రభావం తగ్గించే దిశగా చర్యలు తీసుకుని.. మరోవైపు ఎన్నికల్లోనూ దూకుడు పెంచాల్సిన అవసరం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.