అదే నిజ‌మైతే.. కేసీఆర్‌కు 100 సీట్లు వ‌చ్చేవి: రేవంత్‌

త‌మ ప్ర‌భుత్వంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్ కుట్ర‌లు చేస్తున్నార‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచ‌లన ఆరోప‌ణ‌లు చేశారు. ఏ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించినా.. సైంధ‌వుల్లాగా అడ్డు ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వెనుక బ‌డ్డ బీసీ కులాల‌కు రిజ‌ర్వేష‌న్ ఫ‌లాలు ద‌క్కాల‌న్న స‌దుద్దేశంతో తాము చేప‌ట్టిన కుల గ‌ణ‌న‌ ప్ర‌క్రియ‌ను చూసి ఓర్వలేక పోతున్నార‌ని విమ‌ర్శించారు. అందుకే అడుగ‌డుగునా అడ్డుప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. కుల గ‌ణ‌న జ‌ర‌గ‌కూడ‌ద‌న్న‌ది మోడీ, కేసీఆర్ ప్ర‌ధాన ఉద్దేశ‌మ‌ని సీఎం చెప్పారు.

కానీ, కుల గ‌ణ‌నను ఎట్టి ప‌రిస్థితిలోనూ త‌మ ప్ర‌భుత్వం పూర్తి చేసి తీరుతుంద‌న్నారు. ఇంకా మిగిలిన వారు ఉంటే.. ఈ గ‌ణ‌న‌లో పాల్గొనాలని ఆయ‌న పేర్కొన్నారు. ఇప్ప‌టికే కుల గ‌ణ‌న నివేదికను అసెంబ్లీలో కూడా ప్ర‌వేశ పెట్టిన‌ట్టు చెప్పారు. దానిలో ఏవో లోపాలున్నాయంటూ.. యాగీ చేస్తున్నార‌ని.. కానీ, వాస్త‌వానికి అన్ని స్థాయిల‌లోనూ కుల గ‌ణ‌నను ప‌క్కాగా నిర్వ‌హించామ‌ని సీఎం చెప్పారు. ఈ గ‌ణ‌న ద్వారా వెనుక‌బ‌డిన బీసీల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని సీఎం చెప్పారు. వారికి రిజ‌ర్వేష‌న్ ఫ‌లాలు అందుతాయ‌న్నారు.

అయితే.. ఇదే జ‌రిగితే.. త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు దెబ్బ‌తింటాయ‌ని భావిస్తున్న మోడీ, కేసీఆర్‌లు అడ్డు ప‌డే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. అధికారిక లెక్క‌లు ఉంటే.. బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ పెంచేలా సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ మేర‌కు శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని గాంధీ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన యువజ‌న కాంగ్రెస్ నేత‌ల ప్ర‌మాణ స్వీకార ఉత్స‌వంలో సీఎం పాల్గొన్నారు. ఆయ‌న మాట్లాడుతూ.. కుల గ‌ణ‌న చేప‌ట్ట‌డం అనేది అంత ఈజీకాద‌న్నారు. ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకుని దీనిని చేప‌ట్టామ‌న్నారు.

కేసీఆర్‌కు 100 సీట్లు వ‌చ్చేవి!

డ‌బ్బుల‌తో రాజ‌కీయాలు చేయ‌లేమ‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాయ‌కులు కూడా డ‌బ్బుల‌తో ఎద‌గ‌ర‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం ద్వారానే వారి మ‌న‌సులు గెలుచుకునే ప‌రిస్థితి ఉంటుంద‌న్నారు. కేవ‌లం డ‌బ్బుతోనే నాయ‌కులు ఎదుగుతార‌ని అనుకుంటే.. కేసీఆర్ 100 సీట్ల‌లో గెలిచి ఉండేవార‌ని చెప్పారు. నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌ని, అప్పుడే ప్ర‌జ‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యానికి కృషి చేసిన ప్ర‌తి ఒక్క నేత‌కు కూడా వ‌చ్చే స్థానిక ఎన్నిక‌ల్లో అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని తెలిపారు.