బాబు, కేసీఆర్ లపై రేవంత్ ఇంటరెస్టింగ్ కామెంట్స్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం టీపీసీసీ కార్యాలయం గాంధీ భవన్ వేదికగా చేసిన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన రాజకీయ గురువు అయిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో పాటుగా, తన రాజకీయ ప్రత్యర్థి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుల పేర్లను ప్రస్తావిస్తూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం యూత్ కాంగ్రెస్ గురించి గొప్పగా చెప్పిన సందర్భంగా రేవంత్ నోట… చంద్రబాబు, కేసీఆర్ పేర్లు వినిపించాయి.

యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన వారే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లోనే కాకుండా యావత్తు కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లో ఉన్నారని రేవంత్ తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులందరితో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారేనని ఆయన వ్యాఖ్యానించారు. యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వారంతా కీలక పదవులను అందుకున్నారని కూడా ఆయన తెలిపారు. పదవులు కాస్త అటూఇటూ కావచ్చు గానీ… యూత్ కాంగ్రెస్ నేతలందరికీ ఎప్పుడో ఒకప్పుడు కీలక పదవులు దక్కడం ఖాయమేనని ఆయన తెలిపారు.

ఈ సందర్బంగా చంద్రబాబు, కేసీఆర్ లను రేవంత్ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబుతో పాటుగా బీఆర్ఎస్ అధినేతగా ఉన్న తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వారేనని ఆయన గుర్తు చేశారు. యూత్ కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వారిద్దరూ తమ రాజకీయ జీవితాల్లో అత్యున్నత స్థానాలను అందుకున్నారని రేవంత్ అన్నారు. అంతేకాకుండా ఇప్పటికీ వారిద్దరూ రాజకీయంగా ఇంకా యాక్టివ్ గా ఉన్న విషయాన్ని కూడా రేవంత్ గుర్తు చేసుకున్నారు.

పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే 1977లో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు.. అదే ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాడే చంద్రబాబు మంత్రి పదవిని దక్కించుకుని రికార్డులకెక్కారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరిపోయారు. ఇక కేసీఆర్ కూడా 1977 ప్రాంతంలో యూత్ కాంగ్రెస్ తోనే తన రాజకీయ జీవితం ప్రారంభించారు. అయితే అనతి కాలంలోనే ఆయన కాంగ్రెస్ కు దూరంగా జరిగారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన తర్వాత తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యే గెలిచేందుకు కాస్తంత ఎక్కువ సమయమే తీసుకున్న కేసీఆర్… తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే చంద్రబాబు మాదిరే మంత్రి పదవిని దక్కించుకున్నారు.