ఐప్యాక్ ను జగన్ గుడ్డిగా నమ్మారా…?

2019 ఎన్నికల్లో ఏపీలోని 175 అసెంబ్లీ సీట్లలో 151 సీట్లు, 25 ఎంపీ సీట్లలో 22 సీట్లు సాధించింది. ఇది నిజంగానే గ్రాండ్ విక్టరీ కిందే లెక్క. అంతకుముందెన్నడూ తెలుగు నేలలో ఏ ఒక్క పార్టీకి కూడా సాధ్యం కాని మెజారిటీనేనని చెప్పాలి. ఈ మెజారిటీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో ఓ రకమైన గుడ్డి నమ్మకాన్ని పెంచి పోషించిందన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

2019లో ఆ పార్టీకి రాజకీయ వ్యూహాలు అందించింది ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐ ప్యాక్ సంస్థ అన్న విషయం అందరికీ తెలిసిందే. 2024 ఎన్నికల్లోనే అదే సంస్థ వైసీపీ విజయం కోసం పని చేసింది. అయితే 2019లో రికార్డు మెజారిటీ వస్తే… 2024లో మాత్రం కనీవినీ ఎరుగని ఘోర పరాభవం ఎదురైంది.

ఐదేళ్లలోనే ఇంతలా వైసీపీకి భిన్న ఫలితాలు ఎలా వచ్చాయన్న విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేసింది. 2019లో వైసీపీకి సేవలు అందించిన ఐ ప్యాక్… ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలో పనిచేసింది. గడపగడపకు వైసీపీ పేరిట నాడు పీకే ఇచ్చిన వ్యూహం వైసీపీకి ఓ రేంజి లాభాన్ని అందించింది. అంతేకాకుండా కావాలి జగన్.. రావాలి జగన్ అంటూ పీకే రూపొందించిన స్లోగన్ జగన్ పేరు మారుమోగేలా చేసింది.

ఇక చివరాఖరుగా…ఒక్క ఛాన్స్ అంటూ జగన్ నోట నుంచి వినిపించిన డైలాగ్ కూడా పీకే మదిలో నుంచి పుట్టిన నినాదమే. ఇన్నేసి నినాదాలు, సరికొత్త వ్యూహాలను రచించిన పీకే… జగన్ ను అఖండ మెజారిటీతో విజయ తీరాలకు చేర్చారు. పీకే చేసిన ఈ కృషిలో ప్రస్తుత ఐ ప్యాక్ చీఫ్ రిషి రాజ్ సింగ్ పాత్ర అత్యంత కీలకమని చెప్పక తప్పదు.

2024 ఎన్నికలు రాక మునుపే…2019 ఎన్నికలు ముగిసినంతనే… ఐ ప్యాక్ పై రిషిరాజ్ పట్టు సాదించారు. ఆ సంస్థ నుంచి వ్యవస్థాపకుడిగా ఉన్న పీకేనే బయటకు పంపేశారు. ఐ ప్యాక్ వ్యవహారాలు తన చేయి దాటిపోయాయని భావించిన పీకే కూడా చేసేదేమీ లేదన్న భావనతో ఐ ప్యాక్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత రిషిరాజ్ నేతృత్వంలో ఐ ప్యాక్ పెద్ద సంఖ్యలో కాంట్రాక్టులను అయితే చేజిక్కించుకుంది… గానీ ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా ఆ సంస్థ విక్టరీని అందించలేకపోయింది.

2019 ఎన్నికల్లో తనకు సేవలు అందించిన ఐ ప్యాకే 2024లోనూ తనకు సేవలు అందిస్తోంది కదా అన్న థీమాతో ఉన్న జగన్… ఐ ప్యాక్ వ్యూహాల్లో కొత్త దనం కాదు కదా… జనాన్ని ఆకట్టుకునే ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా లేని విషయాన్ని గుర్తించలేకపోయారు. ఎంతసేపూ 2019లో తనకు రికార్డు విక్టరీని అందించింది కదా అన్న గుడ్డి నమ్మకంతోనే సాగిన జగన్… తన పార్టీకి పదునైన వ్యూహాలు అందని విషయాన్ని గుర్తించలేక చతికిలబడిపోయారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

వాస్తవానికి పార్టీ నేతలను కూడా పెద్దగా నమ్మని జగన్… రిషి రాజ్ ను మాత్రం బాగా నమ్మినట్లు చెబుతున్నారు. ఎందుకంటే… 2019 ఎన్నికలకు ముందు పీకే రచించిన వ్యూహాల రచనలో రిషిరాజ్ కీలక భూమిక పోషించారట. ఈ విషయాన్ని జగన్ తన కళ్లారా చూశారట. దీంతో పీకే మీద ఎంత నమ్మకం కుదిరిందో… రిషిరాజ్ మీద కూడా జగన్ కు అదే తరహాలో నమ్మకం కుదిరిందట.

ఐ ప్యాక్ నుంచి పీకే బయటకు వెళ్లిపోతున్నప్పుడు… రిషి రాజ్ లేకుంటే పీకే ఈ స్థాయిలో పనిచేసే వారు కాదేమోనన్న బావనతోనూ జగన్ ఉన్నారట. అందుకే… పీకే లేకున్నా కూడా… రిషిరాజ్ నేతృత్వం వహిస్తున్నప్పటికీ.. ఐ ప్యాక్ సేవలను కొనసాగించేందుకు సమ్మతించారట. పీకే చేతి కింద పనిచేసిన రిషిరాజ్… సొంతంగా వ్యవహారాలను చక్కబెట్టలేరన్న విషయాన్ని జగన్ గుర్తించలేకపోయారని, ఈ కారణంగానే జగన్ 2024లో ఘోరంగా ఓడిపోయారని విశ్లేషణలు సాగుతున్నాయి.