వంశీ అరెస్ట్ అయినరోజే… టీడీపీలోకి ఆళ్ల నాని

ఏపీలో విపక్షం వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గురువారం తెల్లవారుజామున ఆ పార్టీకి చెందిన కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ అయ్యారు. ఈ పరిణామం నుంచి వైసీపీ తేరుకోకముందే…రాత్రికంతా పార్టీకి చెందిన మరో కీలక నేత, మాజీ మంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని పార్టీని వీడారు. వైసీపీని వీడిన నాని… నేరుగా టీడీపీలోకి చేరిపోయారు.

ఈ మేరకు గురువారం రాత్రి ఉండవల్లిలోని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లిన నాని,… చంద్రబాబు సమక్షంలోనే పార్టీలో చేరిపోయారు. వైసీపీని వీడి వచ్చిన నానికి పార్టీ కండువా కప్పిన చంద్రబాబు… ఆయనను టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇలా ఒకే పార్టీకి చెందిన ఓ కీలక నేత అరెస్ట్ అయిన రోజే… అదే పార్టీకి చెందిన మరో కీలక నేత పార్టీని వీడి వైరి వర్గంలో చేరిపోవడం గమనార్హం. వెరసి వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడిపోయిందనే చెప్పాలి.

ఆళ్ల నాని రాజకీయంగా మిస్టర్ క్లీన్ అనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీతో రాజకీయం ప్రారంభించిన నాని… జగన్ వైసీపి పేరిట వేరు కుంపటి పెట్టగానే.. జగన్ వెంట నడిచిన తొలి నేతగా నానికి పేరుంది. నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా…జగన్ మీద ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ ఆయన వైసీపీలో చేరారు. ఈ పరిణామంతో నాడు నాని పేరు రెండు తెలుగు రాస్ట్రాల్లో మారుమోగిపోయింది.

తనను నమ్మి వచ్చిన నానికి జగన్ కూడా మంచి ప్రాధాన్యమే ఇచ్చారని చెప్పాలి. వైసీపీ అధికారంలోకి వచ్చినంతనే తొలి కేబినెట్ లోనే నానికి కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలు దక్కాయి. కీలకమైన కరోనా సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా శక్తికి మించి పనిచేసిన నాని… జగన్ తో పాటు ప్రజల వద్ద మంచి మార్కులే దక్కించుకున్నారు. ఆ తర్వాత ఎందుకనో గానీ… జగన్, నానిల మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది.

మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందే నాని… వైసీపీకి దూరం జరగాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఆయన ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలోకి అప్పుడే చేరిపోదామని భావించినా…ఏలూరులోని ఆయన ప్రత్యర్థులు… ప్రత్యేకించి ఏలూరు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే పలు దఫాలుగా జరిగిన చర్చలు ఫలించి… చివరకు నాని చేరికకు టీడీపీ ఆమోద ముద్ర వేసింది. ఫలితంగా గురువారం ఆయన టీడీపీలో చేరిపోయారు.