వైసీపీ నేత అబ్బయ్య చౌదరిపై కేసు… రీజనేంటంటే..?

ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ యువ నేత కొఠారు అబ్బయ్య చౌదరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్బయ్యతో పాటుగా ఆయనకు చెందిన కొందరు అనుచరులపైనా పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ కారు డ్రైవర్, గన్ మన్ ఫిర్యాదుల ఆధారంగా ఈ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు దారి తీసిన కారణాలు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దెందులూరు పరిధిలోని వట్లూరులో బుధవారం రాత్రి జరిగిన ఓ వివాహ వేడుకకు ఇటు అబ్బయ్యతో పాటు అటు ప్రభాకర్ కూడా హాజరయ్యారు. అయితే తన కారుకు అబ్బయ్య కారు అడ్డంగా పెట్టారని… కావాలనే తనతో గొడవ పెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే అబ్బయ్య ఆదేశాలతో ఆయన డ్రైవర్ తన కారును తన కారుకు అడ్డంగా పెట్టారంటూ చింతమనేని ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా అబ్బయ్య డ్రైవర్ ను చింతమనేని బూతులు తిట్టారు. ఈ వీడియో బుధవారం రాత్రి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

అయితే గురువారం ఉదయం మీడియా ముందుకు వచ్చిన చింతమనేని… అబ్బయ్య అనుచరులు తనపై దాడి చేసేందుకు యత్నించారని సంచలన ఆరోపణ చేశారు. ఈ క్రమంలోనే అబ్బయ్య అనుచరులు కొందరు తన కారు డ్రైవర్ తో పాటుగా తన గన్ మన్ పైనా దాడికి యత్నించారని ఆయన ఆరోపించారు. తనకు కోపం తెప్పించి… తనతో గొడవ పెట్టుకోవడమే లక్ష్యంగా అబ్బయ్య ఏకంగా 25 మంది అనుచరులతో అక్కడికి వచ్చారని ఆయన ఆరోపించారు. అయితే ఇలాంటి చిల్లర వేషాలను తాను సహించేది లేదని కూడా చింతమనేని తెలిపారు. తన డ్రైవర్, గన్ మన్ లపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు.

చింతమనేని కారు డ్రైవర్, గన్ మన్ ఫిర్యాదుతో అబ్బయ్య చౌదరి సహా ఆయన అనుచరులు కొందరిపై క్రిమినల్ కేసులను పోలీసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే…అందరి మాదిరే వట్లూరు పెళ్లికి తనకు ఆహ్వానం అందితేనే వెల్లానని అబ్బయ్య తెలిపారు. ఈ పెళ్లికి తనతో పాటు చాలా పెద్ద వారు కూడా వచ్చారన్నారు. చింతమనేని కంటే ముందుగానే తాను పెళ్లికి వెళ్లానని, తన తర్వాతే చింతమనేని వచ్చారని… అయితే తనను కొందరు పలకరించగా…వారితో మాట్లాడుతూ ఉండపోవాల్సి వచ్చిందని… ఈలోగానే కారు ఎందుకు అడ్డం పెట్టారంటూ చింతమనేని తన కారు డ్రైవర్ పై విరుచుకుపడ్డారని మండిపడ్డారు. అయినా ఓ శాసనసభ్యుడిగా ఉండి కూడా చింతమనేని నోట అలాంటి భాష ఎలా వస్తుందంటూ అబ్బయ్య వ్యాఖ్యానించారు.