వైసీపీ పాలనలో ‘బూతుల మంత్రి’గా ఫేమస్ అయిన మినిస్టర్.. కొడాలి నాని. అప్పట్లో ఆయన నోరు విప్పితే.. ‘వాడు-వీడు-అమ్మ మొగుడు’ అంటూ ప్రత్యర్థి నాయకులపై విరుచుకుపడే వారు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకుడు దేవినేని ఉమా తొలిసారి కొడాలిని ‘బూతుల మంత్రి’ అని సంబోధించారు. ఇది ఆ తర్వాత కాలంలో కొడాలికి ఒక ‘బిరుదు’గా మారిపోయింది. కాగా.. ఇప్పుడు వైసీపీ అధికారంలో లేకపోగా.. కొడాలి కూడా గత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.
అయినప్పటికీ.. కొడాలిని మాత్రం సోషల్ మీడియాజనాలు ‘బూతుల మంత్రి’ అనే సంబోధించడం గమనార్హం. తరచుగా ఆయనపై వ్యంగ్యాస్త్రాలు కూడా పడుతున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీని పోలీసులు కుట్ర, కిడ్నాప్ కేసుల్లో అరెస్టు చేసి.. జైలుకు తరలించారు. ఈ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. టీడీపీ నేత సత్యవర్థన్‌ను బెదిరించడంతోపాటు.. కిడ్నాప్ చేశారన్నది ప్రధాన అభియోగం. దీంతో వంశీ అరెస్టయ్యారు. ప్రస్తుతం జైలుకు కూడా వెళ్లారు.
అయితే.. ఈ పరిణామాలను ఉటంకిస్తున్న నెటిజన్లు.. బూతుల మంత్రి అరెస్టు ఎప్పుడు? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు నెక్ట్స్ టార్గెట్ ఇదే అయి ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం వంశీ అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలపై నెటిజన్లు చేస్తున్న ఈ కామెంట్లు ఆసక్తిగా మారాయి. ఇటీవల పౌర సరఫరాల శాఖకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని అక్రమ పద్ధతుల్లో ఆఫ్రికా దేశాలకు తరలిస్తున్నట్టు వార్త లు వచ్చాయి. ఈ క్రమంలో కొడాలి నానీపై కేసు నమోదు చేయడం పక్కా.. అనే చర్చ వచ్చింది.
కానీ, ఎందుకో ఆయనపై ఎలాంటి కేసు పెట్టలేదు. నిజానికి అప్పట్లోనే బూతుల మంత్రి చిక్కుకున్నారంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. అయితే.. ప్రస్తుతం ఈ రేషన్ బియ్యం కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో ఏదో ఒకరోజు కొడాలికి కూడా ఉచ్చు బిగుస్తుందన్న ప్రచారం జరిగింది. ఇక, ఇప్పుడు మాత్రం నెటిజన్లు బూతుల మంత్రి అరెస్టు తప్పదని అంటున్నారు. కానీ, సీఎం చంద్రబాబు ఏదైనా చర్య తీసుకుంటే పక్కాగా ఉంటుంది. అలానే కొడాలి విషయంలోనూ పక్కా ఆధారాలు సేకరించే వరకు సేఫేనని విశ్లేషకులు భావిస్తున్నారు.