వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ జైలుకు వెళ్లారు. వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరచగా… న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. వంశీ అరెస్ట్, ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న పరిణామాలు గురువారం ఉదయం నుంచి రాత్రి దాకా ఏపీలో పెను ఆసక్తిని రేకెత్తించిన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వంశీ అనుచరులు జరిపిన దాడికి సంబంధించిన కేసును మాఫీ చేయించుకునే క్రమంలో.. ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉన్న టీడీపీ ఆపీస్ కంప్యూటర్ ఆపరేటర్ ముదునూరి సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసిన వంశీ.. ఆయనపై బెదిరింపులకు పాల్పడ్డారన్న ఫిర్యాదులపై పోలీసులు కొత్త కేసు పెట్టారు. ఈ కేసులోనే వంశీని గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన విజయవాడ పటమట పోలీసులు ఆ తర్వాత విజయవాడ తరలించారు.
గురువారం మధ్యాహ్నం సమయానికంతా విజయవాడకు తీసుకొచ్చిన వంశీని తొలుత భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు… ఆ తర్వాత కృష్ణలంక పీఎస్ కు తరలించారు. అక్కడే దాదాపుగా 9 గంటల పాటు వంశీని విచారించిన పోలీసులు ఆయన నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఈ సమయంలో వంశీని కలిసేందుకు ఆయన సతీమణి పీఎస్ కు వచ్చినా పోలీసులు ఆమెను అనుమతించలేదు. కేవలం లాయర్లను మాత్రమే పోలీసులు అనుమతించగా… 9 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం విజయవాడ జీజీహెచ్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విజయవాడ ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి వద్దకు తరలించారు. వంశీతో పాటుగా ఈ కేసుతో సంబంధముందని భావిస్తున్న శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతిలను కూడా పోలీుసులు న్యాయమూర్తి ఎధుట హాజరుపరిచారు.
ఈ సందర్భంగా నిందితుడిగా వంశీని జడ్జీ ముందు ప్రవేశపెట్టిన పోలీసులు…ఆ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టును మాత్రం సమయానికి జడ్జీకి అందించలేకపోయారు. దీంతో పోలీసుల తీరుపై జడ్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని మాత్రమే తీసుకుని వస్తే… రిమాండ్ రిపోర్ట్ లేకుండా తానేం చేయాలని ఆయన వారిపై ఫైర్ అయ్యారు. ఆ తర్వాత చాలా సేపటికి రిమాండ్ రిపోర్టు రాగా… దానిని జడ్జీకి అందజేసిన పోలీసులు… వంశీకి రిమాండ్ విధించాలని కోరారు. అయితే ఈ కేసులో తన ప్రమేయమేమీ లేదని వాదిస్తూ వంశీ తరఫు న్యాయవాదులు,… ఆయనకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. రిమాండ్ రిపోర్ట్, బెయిల్ పిటిషన్లను పరిశీలించిన జడ్జీ… వంశీకి రిమాండ్ విధించారు. దీంతో రాత్రి 2.30 గంటల సమయంలో వంశీని పోలీసులు జైలుకు తరలించారు.