కామేపల్లి తులసిబాబుకు ఏపీ సీఐడీ భారీ నజరానా ఇచ్చిందన్న వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజుపై గతంలో ఆయన ఎంపీగా ఉండగా సీఐడీ కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగం జరిగిందన్న కేసులో తులసి బాబు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. రఘురామపై టార్చర్ జరుగుతున్న సమయంలో సీఐడీ కార్యాలయానికి వచ్చిన తులసిబాబు.. రఘురామ గుండెలపై కూర్చున్నారని, సీఐడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఆయన అలా చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ విషయంలోనే తులసిబాబు అరెస్ట్ కాగా… ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం హైకోర్టులో ఉంది.
అయినా తులసిబాబుకు నాటి సీఐడీ అధికారులు రూ.48 లక్షలు ఇచ్చారంటూ తాజాగా బుధవారం రఘురామ సంచలన ఆరోపణ చేశారు. అయితే ఆదేదో… రఘురామ గుండెలపై కూర్చున్నందుకు తులసిబాబుకు సీఐడీ ఆ మొత్తాన్ని ఇవ్వలేదట. సీఐడీ కేసుల్లో లీగల్ అసిస్టెంట్ గా వ్యవహరించినందుకు లాయర్ ఫీజుల కింద ఆ మొత్తాన్ని తులసిబాబుకు అందించారట. ఇదే విషయాన్ని చెప్పిన రఘురామ… దీనిపైనా విచారణ చేపట్టాలని కోర్టును కోరనున్నట్లు ఆయన చెప్పారు. సీఐడీకి లీగల్ అసిస్టెంట్ గా వ్యవహరించేంత అనుభవం తులసిబాబుకు లేదని కూడా రఘురామ ఆరోపించారు. కేవలం నాటి సీఐడీ చీప్ పీవీ సునీల్ కుమార్ కు సన్నిహితుడన్న కారణంగానే ఈ మొత్తాన్ని తులసిబాబుకు అందించారన్నది రఘురామ ఆరోపణ.
ఈ వ్యవహారంలో మరో మతలబు కూడా ఉందని రఘురామ చెప్పారు. 2021లో తులసిబాబు ఏపీ బార్ కౌన్సిల్ లో తన పేరును న్యాయవాదిగా రిజిస్టర్ చేసుకున్నారని ఆయన తెలిపారు. అయితే సీఐడీ మాత్రం తులసిబాబును 2020 అక్టోబర్ లోనే లీగల్ అసిస్టెంట్ గా నియమించుకుందని తెలిపారు. హైకోర్టులో సీఐడీ తరఫున 12 కేసుల విచారణకు తులసిబాబును లీగల్ అసిస్టెంట్ గా నియమించుకున్నట్టుగా సీఐడీ చెబుతుంటే… అసలు సీఐడీ కేసుల ట్రయల్ హైకోర్టులోనే ఉండదని రఘురామ తెలిపారు. అంటే… పీవీ సునీల్ కుమార్ చెప్పినట్టుగా వ్యవహరించిన కారణంగానే తులసిబాబుకు నజరానాగా రూ.48 లక్షలను ఇచ్చారని రఘురామ ఆరోపించారు.