“జగన్ గురించి ఎందుకు అంత వ్యతిరేక ప్రచారం చేస్తున్నారో.. నాకు ఇప్పటికీ అర్ధం కాదు. ఆయన చాలా మంచి వారు. పేదలకు అప్పట్లో వైఎస్ ఎలా అయితే సాయం చేశారో.. జగన్ కూడా అలానే చేశారు. ఇంకా చేయాలని అనుకున్నారు. కానీ, ఆయనను కొందరు(పేరు చెప్పలేదు) వ్యతిరేక శక్తిగా చూపించే ప్రయత్నం చేశారు. వారు తమ ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. కానీ, వాస్తవాలు ఇప్పుడు ప్రజలకు తెలుస్తున్నాయి“ అని మాజీ మంత్రి, ఇటీవల వైసీపీలో చేరిన సాకే శైలజానాథ్ వ్యాఖ్యానించారు.
తాజాగా ఆయన అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంపార్టీ కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌పై పొగడ్తల జల్లు కురిపించారు. వైఎస్ కుటుంబం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన ఆయన.. జగన్ అంటే.. మరింత అభిమానమన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటినుంచి జగన్‌పై తనకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. సొంత పార్టీ పెట్టుకున్నాక.. తనకు పలు మార్లు ఆహ్వానాలు వచ్చాయని.. కానీ, అప్పట్లో రాలేదన్నారు.
వైసీపీలో గతంలోనే చేరాల్సిఉందన్న సాకే.. అప్పట్లో ఎందుకు చేరలేదో.. కారణాలు ఇప్పుడు చెప్పడం తనకు ఇష్టం లేదన్నారు. ఏదేమైనా.. వైసీపీలో చేరడం తనకు రాజకీయంగా కలిసి వస్తుందన్నది తన నమ్మకమని చెప్పారు. `ఎవరు ఏదో అనుకుంటారని జగన్ ఏమీ భయ పడరు. నేను కూడా అంతే. నేను వైసీపీలో చేరకముందు.. అందరూ నాతో మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఫోన్లు ఎత్తడం లేదు“ అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ.. తన రాజకీయ ప్రయాణం ఆగబోదన్నారు.
ఇక, జగన్-ఆయన సోదరి షర్మిల, మాతృమూర్తి విజయమ్మల గురించి ప్రస్తావించిన సాకే.. వారి కుటుంబం గతంలో మాదిరిగా కలిసి ఉండాలనే తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. ఆస్తుల వివాదాలు చిన్నవే నని.. వీటికి మించి ఏదో శక్తి ఈ కుటుంబంపై పనిచేస్తందని తాను భావిస్తున్నట్టు తెలిపారు.
అయితే… అందరూ కలసి కూర్చుని చర్చించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని.. ఆదిశగా ఏదైనా ప్రయత్నం చేయాల్సి వస్తే.. తాను వెనుకాడేది లేదని అన్నారు. వైఎస్ కుటుంబం పట్ల తనకు ఆరాధనా భావం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని కూటమిసర్కారు వ్యతిరేకత త్వరలోనే బయట పడుతుందని.. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని సాకే ముక్తాయించారు.