ఏపీలో జూన్ లోగా విధుల్లోకి కొత్త టీచర్లు!

ఏపీలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీకి సర్వం సిద్ధం అయిపోయింది. మెగా డీఎస్సీఫై ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య శాఖా మంత్రి నారా లోకేష్ స్పష్టమైన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వచ్చే విద్యా సంవత్సరం మొదలు అయ్యేలోగానే డీఎస్సీ నియామకాలను భర్తీ చేస్తామని ఆయన చెప్పిన సంగతీ తెలిసిందే. లోకేష్ ప్రకటనకు అనుగుణంగానే పాఠశాల విద్య శాఖ మెగా డీఎస్సీకి సంబంధించి స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో ఆ శాఖ ఏకంగా మెగా డీఎస్సీ షెడ్యూల్ కూడా విడుదల చేసింది.

విద్య శాఖ ప్రకటన ప్రకారం.. మార్చి నెలలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే దరఖాస్తుల స్వీకరణ… డీఎస్సీ నిర్వహణ, ఫలితాల విడుదల వంటి వాటిని నిర్దేశిత సమయంలోగా పూర్తీ చేసి… జూన్ నెల ప్రథమార్ధంలోనే ఫలితాలు విడుదల చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. అంటే.. లోకేష్ చెప్పినట్టుగానే.. జూన్ మాసంలో పాఠశాలలు తెరిచేలోగా కొత్త ఉపాధ్యాయులు తమకు కేటాయించిన బడుల్లో విధుల్లో చేరిపోతారన్న మాట. ఈ మేరకు పాఠశాల విద్య శాఖ కార్యదర్శి కోన శశిధర్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ మెగా డీఎస్సీలో మొత్తంగా 16,247 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ)- 7,725, సెకండ‌రీ గ్రేడ్ టీచ‌ర్లు (ఎస్‌జీటీ)- 6,371, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (టీజీటీ)- 1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (పీజీటీ)- 286, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీ)- 132, ప్రిన్సిపాల్స్- 52 పోస్టులు ఉన్నాయి. ఇక అభ్యర్థులు భయపడుతున్న జీఓ 117కు ప్ర‌త్యామ్నాయం తీసుకొస్తామని శశిధర్ పేర్కొన్నారు. గ‌తంలో టీచ‌ర్లకు 45 ర‌కాల యాప్ లు ఉండేవ‌ని, వాటన్నింటినీ క‌లిపి ఒకే యాప్ గా మార్చేశామ‌ని కూడా ఆయన తెలిపారు.