వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్. సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు మాటలను పేర్చుకుని అంబటి సంధించే విమర్శలు వైరి వర్గాలను అతలాకుతలం చేసేస్తాయి. అంబటి గురించి పూర్తిగా తెలియని వారు అయితే… ఆయన మాటలు నిజమేనేమోనని నమ్మే అవకాశాలు కూడా ఉన్నాయి. అబద్దాన్ని కూడా నిజంలాగా మార్చి మరీ చెప్పడంలో అంబటిని మించిన వారు లేరని చెప్పక తప్పదు.
అయినా.. ఇప్పుడు అంబటి గురించి ఇంతగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే.. సోమవారం మీడియా ముందుకు వచ్చిన ఆయన మెగాస్టార్ చిరంజీవి పైన, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వం వహిస్తున్న జనసేన పార్టీల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చిరు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకువచ్చి మరీ అంబటి చేసిన వ్యాఖ్యలు నిజంగానే సంచలనమనే చెప్పాలి. ప్రజారాజ్యానికి ఏ గతి అయితే పట్టిందో… ఇప్పుడు జనసేనకు కూడా అదే గతి పడుతుందంటూ… అంబటి ఏకంగా భవిష్యవాణిని వినిపించారు.
అయినా… అంబటి ఏమన్నారన్న విషయానికి వస్తే… చిరంజీవి మంచివారని, సౌమ్యులు అని చెబుతూనే… చిరు రాజకీయాలకు పనికి రారని తేల్చి పారేశారు. అంతటితో ఆగని అంబటి… నాడు ప్రజారాజ్యం పేరిట రాజకీయ పార్టీని పెట్టిన చిరు… ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారని తెలిపారు. ఇక తన ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందిందన్న చిరు వ్యాఖ్యలను గుర్తు చేసిన అంబటి.. ప్రజారాజ్యం మాదిరిగానే జనసేనను బీజేపీలో విలీనం చేస్తారని సంచలన ఆరోపణ చేశారు.
అక్కడితో కూడా అంబటి ఆగలేదు. నాడు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరు కేంద్ర మంత్రి పదవిని తీసుకున్నారని వ్యాఖ్యానించారు. అప్పటి మాదిరిగానే… ఇప్పుడు కూడా జనసేనను బీజేపీలో విలీనం చేసి మరోమారుకేంద్ర మంత్రి పదవి తీసుకుంటారా అంటూ అంబటి వ్యంగాస్త్రాలు సంధించారు. చిరు మంచి వారు అంటూనే… ఆయన క్యారెక్టర్ ను హననం చేసేలా పార్టీలను విలీనం చేసి మంత్రి పదవులు పొందారంటూ చిరును తక్కువ చేసి చూపించారు. ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులు ఫైర్ అయిపోతున్నారు.