వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఓ కీలక సాక్ష్యం పోలీసుల చేతికి చిక్కింది. అది కూడా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు టీడీపీ ఇంచార్జి గా ఉన్న యువ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి నుంచి పోలీసులకు ఈ సాక్ష్యం చిక్కింది. రవి సాక్ష్యంతో ఈ కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభించడం ఖాయంగానే కనిపిస్తోంది. అంతేకాకుండా వివేకా హత్యకు దారి తీసిన కారణాలు కూడా ఓ మోస్తరుగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
వివేకాను హత్య చేసిన దస్తగిరి తన నేరాన్ని ఇప్పటికే ఒప్పుకొన్న సంగతి తెలిసిందే. అయితే ఎవరి ప్రోద్బలంతో ఈ హత్య చేశానన్న విషయాన్నిదస్తగిరి పూర్తిగా వెల్లడించలేదని చెప్పాలి. ఆ విషయాన్ని చెబితే.. దస్తగిరికి ముప్పు తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మాట నిజమేనన్నట్టుగా జైలులో ఉన్న సందర్బంగా దస్తగిరికి బెదిరింపులు ఎదురయ్యాయి. ఈ విషయాన్ని దస్తగిరి స్వయంగా వెల్లడించాడు. అయితే ఓ నేరస్తుడు చెప్పిన మాట ఎలా నమ్మేది అన్న మాట కూడా వినిపించింది. ఇప్పుడు ఆ అనుమానం కూడా వీడిపోయింది.
కడప జైల్లో ఉండగా.. చైతన్య రెడ్డి తనను బెదిరించారని దస్తగిరి పోలీసులకు చెప్పాడు. ఈ విషయంలో దస్తగిరి మాటలను అంతగా నమ్మని పోలీసులు… ఈ విషయాన్ని ఎవరైనా చూశారా అన్న దిశగా ఆరా తీశారు. అప్పుడే పోలీసుల మదిలో బీటెక్ రవి పేరు మెదిలింది. ఎందుకంటే… దస్తగిరిని చైతన రెడ్డి బెదిరించిన సమయంలో రవి కడప జైల్లోనే ఉన్నారు. అది కూడా దస్తగిరి ఉన్న బ్యారక్ కు ఎదురుగా ఉన్న బ్యారక్ లోనే రవి ఉన్నారు. దీంతో ఈ కేసును విచారిస్తున్న రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్.. రవిని ఆరా తీశారు.
నాడు దస్తగిరి బ్యారక్ లోకి చైతన్య రెడ్డి వెళ్లడం మీరు చూశారా అని బీటెక్ రవిని రాహుల్ ఆరా తీశారు. దీంతో… నాడు దస్తగిరి బ్యారక్ లోకి చైతన్య రెడ్డి వెళ్లారని… ఆ బ్యారక్ కు ఎదురుగా ఉన్న తాను ఈ దృశ్యాన్ని చూశానని రవి చెప్పారట. అంటే.. అసలు విషయాన్ని పోలీసుల ముందు చెప్పరాదని దస్తగిరిని చైతన్య రెడ్డి బెదిరించిన మాట వాస్తవమేనని తేలిపోయింది. వెరసి వివేకా హత్యకు దారి తీసిన కారణాలను సమాధి చేసే యత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ పరిణామం కేసు దర్యాప్తులో కీలక భూమిక పోషించనుంది చెప్పక తప్పదు.