జన సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల అనారోగ్యానికి గురి అయిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే మొన్న జరిగిన కేబినెట్ భేటీకి పవన్ హాజరు కాలేదు. అయినా కూడా పవన్ కు కుర్చీ కేటాయించిన ఏపీ కేబినెట్.. అందులో ఎవరినీ కుర్చోనివ్వకుండా ఖాళీగానే ఉంచి.. పవన్ ను గౌరవించింది. సాధారణంగా కేబినెట్ భేటీకి ఎవరైనా రాకుంటే… వారికేమీ ప్రత్యేక ఏర్పాట్లు జరిగిన దాఖలాలు లేవనే చెప్పాలి. అయితే పవన్ డిప్యూటీ సీఎం పోస్టులో ఉన్నారు కాబట్టి… ఆయనకు కుర్చీ కేటాయించి ప్రత్యేకంగా గౌరవించింది.
తాజాగా మంగళవారం… ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… అన్ని శాఖలకు చెందిన మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అమరావతిలోని సచివాలయంలో జరగుతున్న ఈ సమావేశానికి… అందరు మంత్రులు హాజరయ్యారు. మంత్రులతో పాటుగా ఆయా శాఖల కార్యదర్శులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి కూడా పవన్ కల్యాణ్ హాజరు కాలేదు. అనారోగ్యం బారిన పడ్డ పవన్ ఇంకా కోలుకోలేదని సమాచారం. ప్రస్తుతం ఆయన తన ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారని… ఈ కారణంగానే ఈ సమావేశానికి రాలేదని సమాచారం.
పవన్ కల్యాణ్ కు అనారోగ్యం అని తెలిసినంతనే మొన్న కేంద్ర మంత్రిగా ఉన్నబీజేపీ సీనియర్ నేత హర్దీప్ సింగ్ పూరి.. సోషల్ మీడియా వేదికగా ఓ సందేశాన్ని పంపారు. పవన్ త్వరగా కోలుకోవాలని సదరు సందేశంలో పూరి అభిలషించారు. అయితే పవన్ కు వచ్చింది కేవలం జ్వరమే కదా… ఆ మాత్రానికే ఏకంగా కేంద్ర మంత్రి గాభరా పడిపోయి… పవన్ త్వరగా కోలుకోవాలంటూ సందేశం పెట్టిన తీరు అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది. ఎంతైనా… పవన్ డిప్యూటీ సీఎం కదా.. ఆయన ఆరోగ్యం పట్ల కేంద్ర మంత్రులకు ఆ మాత్రం ఆసక్తి ఉండటం సహజమే కదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates