ఏపీ అసెంబ్లీలో తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని.. ఆలా అయితేనే తాను అసెంబ్లీకి వస్తానని వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో జగన్ ఏకంగా కోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టులో ఈ విషయంపై విచారణ ఇంకా పూర్తి కాలేదు.
అయితే ఈ ఒక్క అంశం తేలితేనే అసెంబ్లీని సమావేశపరచాలని లేదు కదా. జగన్ పోరాటం కోర్టులో సాగుతున్న.. అసెంబ్లీ సమావేశాలు జరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా ఈ నెల 20 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం అయిపోయింది.
సోమవారం ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణ రాజుతో కలిసి మీడియా ముందుకు వచ్చిన అయ్యన్న.. జగన్ డిమాండ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేది తాను కాదని చెప్పిన ఆయన.. ఓటర్లే ఆ విషయాన్ని నిర్దారిస్తారని చెప్పారు. ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు ఆధారంగానే తాము నడుచుకుంటామని తెలిపారు. ఓటర్ల తీర్పుకు భిన్నంగా నడుచుకునేందుకు తమకు అధికారం లేదని కూడా ఆయన తెలిపారు.
మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ఓటర్లు 11 సీట్లు మాత్రమే ఇచ్చారని అయ్యన్న తెలిపారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే… ఏ పార్టీ అయినా కనీసం 18 సీట్లు సాధించాల్సిందేనని ఆయన తెలిపారు. ఇది చట్టం చెబుతున్న మాట అన్న అయ్యన్న… 11 సీట్లు సాధించిన వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ప్రశ్నిచారు.
అయినా సీఎం చంద్రబాబుకు ఇచ్చినంత సమయం తనకూ ఇవ్వాలంటూ జగన్ చిన్నపిల్లాడి మాదిరిగా మాట్లాడుతున్నారని కూడా అయ్యన్న ఎద్దేవా చేశారు.
ఇక ఆ తర్వాత మైక్ అందుకున్న రఘురామకృష్ణ రాజు.. నిర్ణీత సమయంలోగా సభకు హాజరు అయితే సరేసరి.. లేదంటే జగన్ ఫై అనర్హత వేటు పడిపోతుందని హెచ్చరించారు. స్పీకర్ అనుమతి లేకుండా సభ్యులు సభకు గైరుహాజరు అయ్యేందుకు అవకాశం లేదన్న రాజు… జగన్ కు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని చెప్పారు.
ఈ లెక్కన జగన్ కు ఇకపై ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే ప్రసక్తే లేదని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తేల్చి చెప్పేసినట్టే కదా. మరి జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారా? లేదంటే.. అనర్హత వేటు వేయించుకుంటారా? అన్న దిశగా ఆసక్తికర చర్చకు తెరలేసింది.