జగన్ కు పెద్ద ప్లస్ పాయింట్ ఏమిటో తెలుసా ?

జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ప్లాస్ పాయింట్ ఏమిటో తెలుసా ? ఈ ప్రశ్నకు ఒక్కొక్కళ్ళు ఒక్కోరకంగా సమాధానం చెబుతారేమో. మామూలుగా అయితే అసెంబ్లీలో 151 సీట్లుండటం, 22 ఎంపి సీట్లు గెలుకోవటం అని చెబుతారు. ఇదే సమయంలో కేంద్రంతో మంచి సంబంధాలు ఉండటమే అతిపెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. పార్టీపై తిరుగులేని ఆధిపత్యం ఉండటమే అసలైన బలమని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ కరెక్టే కానీ అసలైన బలం ఏమిటంటే మీడియాకు చా…లా దూరంగా ఉండటమే.

అవును మీరు చదివింది కరెక్టే. మీడియా అన్నది భస్మాసుర హస్తం లాంటిది. ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే అంత నష్టం చేస్తుంది. మీడియాతో రాసుకుపూసుకుని తిరిగిన వాళ్ళలో చాలామంది చివరకు నష్టపోయిన వాళ్ళే ఉన్నారు. ఇదే సమయంలో మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత లాభపడిన వాళ్ళు కూడా ఉన్నారు. 24 గంటలూ మీడియాతో అంటకాగిన వాళ్ళల్లో నష్టపోయిన వాళ్ళకు తాజా ఉదాహరణ వైసీపీ తిరుగుబాటు ఎంపినే. కారణాలు ఏవైనా పార్టీకి దూరంగా జరిగిన దగ్గర నుండి ఎంపి అదేపనిగా జగన్ పై నోరుపారేసుకుంటున్న విషయం అందరు చూస్తున్నదే. సరే ఇదే పద్దతిలో చంద్రబాబునాయుడు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిరోజూ జగన్ ను టార్గెట్ చేసుకుని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు.

చంద్రబాబు స్ధాయి వ్యక్తి ఆరోపణలు చేస్తే జనాలంతా ఆసక్తిగా దాన్ని చదవాలి. కానీ చాలామంది జనాలు పెద్దగా పట్టించుకోవటం లేదు. ఎందుకంటే జగన్ పై చంద్రబాబు ఆరోపణలు, విమర్శలు చేయని రోజంటు ఉండదు. ప్రతిరోజు ఆరోపణలు చేస్తుంటే చదవాలనే ఆసక్తి జనాలకు ఎందుకుంటుంది ? తెలిసో తెలీకో లోకేష్ కూడా తండ్రినే ఫాలో అవుతున్నారు. ప్రతిరోజు అయినదానికి కానిదానికి జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయటానికి ట్విట్టర్ వేదికగా ఉపయోగించుకుంటున్నారు. నాన్నా పులి కథలాగా… ప్రతిరోజు చెబితే… ఇంపార్టెంట్ విషయాలు జనాలకు చేరకుండా పోయే ప్రమాదం ఉంది.

ఇక జగన్ విషయానికి వస్తే స్వతహాగానే మీడియా ఫ్రెండ్లీకాదు. కాబట్టి మీడియా సమావేశాల్లో పాల్గొనాలని జగన్ కు కోరికలేదు. దాదాపు ఏడాదిన్నర క్రితం సిఎంగా బాధ్యతలు తీసుకున్న జగన్ ఇప్పటికి పెట్టిన మీడియా సమావేశాలు మూడంటే మూడు మాత్రమే. ఇదే సమయంలో చంద్రబాబు వారానికి దాదాపు నాలుగు రోజులు మీడియా సమావేశాలు పెట్టి జగన్ పై విరుచుకుపడుతున్నారు. మీడియాలో కనబడాలన్న యావ లేకపోవటమే జగన్ కున్న అతిపెద్ద బలమని వైసీపీ నేతలే చెబుతున్నారు. మీడియా ద్వారా కాకుండా తన పరిపాలన ద్వారా మాత్రమే దగ్గరవ్వాలన్న జగన్ లక్ష్యంలో సక్సెస్ అయ్యారా లేదా అన్నది ఏదన్నా సందర్భం వస్తేనే తెలుస్తుంది.