‘రాయల్’ ఉదంతంలో నయా ట్విస్ట్… లక్ష్మి అరెస్ట్

జనసేన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ చేతిలో మోసపోయానంటూ బయటకు వచ్చిన లక్ష్మి అనూహ్య పరిణామాల మధ్య సోమవారం అరెస్ట్ అయ్యారు. రాజస్థాన్ కు చెందిన జైపూర్ పోలీసులు సోమవారం మధ్యాహ్నం తిరుపతికి వచ్చి లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా లక్ష్మి తరఫు వారు ఎందుకు ఆమెను అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించినా జైపూర్ పోలీసులు సమాధానం ఇవ్వకుండానే లక్ష్మిని తమ వెంట తీసుకెళ్లారు. రాయల్ ఫై ఆరోపణలు చేసిన రెండు రోజుల్లోనే లక్ష్మి ఇలా అరెస్ట్ కావడం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది.

అసలు లక్ష్మిని జైపూర్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారన్న విషయానికి వస్తే.. గతంలో లక్ష్మి ఫై చెక్ బౌన్స్ కేసు నమోదు అయ్యిందట. జైపూర్ లో నమోదు అయిన ఈ కేసులో ఇప్పటిదాకా చర్యలే తీసుకోలేదు. అయితే… రాయల్ ఫై లక్ష్మి ఆరోపణలు చేసినంతనే… ఈ కేసును బయటకు తీసిన పోలీసులు.. ఇప్పుడే ఈ కేసు నమోదు అయినట్టుగా జైపూర్ నుంచి పోలీసులు తిరుపతి వచ్చి ఆమెను అరెస్ట్ చేసిన తీరు అందరిని ఆశ్యర్యానికి గురి చేసిందని చెప్పాలి. జైపూర్ కి చెందిన ఓ లేడీ పోలీసు అధికారి లక్ష్మి చేయి పట్టుకుని… బలవంతంగానే ఆమెను కారు ఎక్కించారు.

జైపూర్ పోలీసులు తనను అరెస్ట్ చేస్తున్న సందర్బంగా లక్ష్మి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయల్ ఫై తాను ఆరోపణలు చేసినందుకే… తనపై కక్ష కట్టి మరీ అరెస్ట్ చేయిస్తున్నారని లక్ష్మి ఆరోపించారు. రాయల్ చేయించిన దౌర్జన్యానికి ఇది నిదర్శనమని కూడా లక్ష్మి వ్యాఖ్యానించారు. లక్ష్మి అరెస్ట్ కు సంబంధిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో నమోదు అయినా కేసులో లక్ష్మిని ఇప్పుడు అరెస్ట్ చేసిన తీరుపై అక్కడ ఉన్నవారు ఒకింత షాక్ కు గురయ్యారని చెప్పాలి.