ఏపీకి గతంలో కేంద్రం నుంచి పెద్దగా నిధులు గానీ, కనీసం కేటాయింపులు గానీ జరిగేవి కావు. కేంద్రంలో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా ఇదే పరిస్థితి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా అదే పరిస్థితి. ఉత్తరాది రాష్ట్రాలకు భారీ ఎత్తున నిధులు ఇస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వాలు…దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం అరకొర నిధులే ఇచ్చేవి. తెలుగు రాష్ట్రాల విషయంలో అయితే ఈ వివక్ష మరింతగా కనిపించేది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పాలి.
2025-2026 కేంద్ర బడ్జెట్లో ఏపీకి భారీ కేటాయింపులు జరిగాయి. అంతేకాకుండా బడ్జెట్ కంటే ముందు మరింతగా నిధులు కేంద్రం నుచి రాష్ట్రానికి వచ్చాయని చెప్పాలి. తాజా రైల్వే బడ్జెట్లో అయితే ఏకంగా ఉత్తరాది రాష్టాల కంటే కూడా ఏపీకి అధిక మొత్తం నిధులు వచ్చాయి. రైల్వే ప్రాజెక్టుల విషయంలోనూ ఏపీకి భారీగానే లబ్ది చేకూరిందని చెప్పాలి. గతంలో అరకొర నిధులు.. ఇప్పుడేమో అడగకున్నా భారీ మొత్తంలో నిధులు ఎలా సాధ్యం అన్న విషయంఫై అందరూ అయోమయానికి గురవుతున్నారు. అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్ మాత్రం ఇందులోని లోగుట్టును కనిపెట్టేసారు.
ఆ లోగుట్టును మంగళవారం నాటి తన ఢిల్లీ టూర్లో లోకేష్ బయటపెట్టారు కూడా. ఏపీలో ప్రస్తుతం కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కూటమిలో మేజర్ ప్లేయర్గా టీడీపీ, ఆ తర్వాత స్థానాల్లో జనసేన, బీజేపీ ఉన్నాయి. అయినా కూడా ఈ మూడు పార్టీలకి చెందిన ఎంపీలు తమ పార్టీలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సాగుతున్నారు. రాష్ట్రానికి చెందిన ఏదైనా సమస్య ఉంటే… అందరూ కలిసికట్టుగా పోరాడుతున్నారు. ఈ విషయాల్లో కేంద్ర మంత్రులను కలవాల్సి వచ్చినప్పుడు అందరూ కలిసే వెళుతున్నారు. ఫలితంగా ఏపీ సమస్యలు అప్పటికపుడే పరిష్కారం అయిపోతున్నాయి.
మంగళవారం నాటి ఢిల్లీ టూర్లో లోకేష్ ఇదే అంశాన్ని కూటమి పార్టీలకి చెందిన ఎంపీలకు చెప్పారు. అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతున్న కారణంగానే రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని… బడ్జెట్లో కేటాయింపులు కూడా భారీగా ఉంటున్నాయని ఆయన తెలిపారు. ఈ కారణంగా ఇదే వ్యూహాన్ని మున్ముందు కూడా కొనసాగిద్దామని ఆయన మూడు పార్టీల ఎంపీలకు సూచించారు. లోకేష్ ఢిల్లీ వచ్చిన సందర్భంగా 1 జనపథ్ లో మూడు పార్టీల ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. లోకేష్ చెప్పినట్టుగా ఈ మంత్రాన్ని పాటించినంత కాలం ఏపీకి నిధుల కొరత ఉండదన్న మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates