వర్మ వెంట వైసీపీ దండు కదిలింది!

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వ్యవహారంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ శుక్రవారం ప్రకాశం జిల్లా పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. వైసీపీ అధికారంలో ఉండగా… నాడు విపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల ఫోటోలను మార్ఫింగ్ చేసిన వర్మ వారిపై అసభ్యకర పోస్టులు పెట్టారు. ఈ పోస్టులఫై టీడీపీ కార్యకర్త ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు కాగా… ఈ కేసులో విచారణకు వర్మ హాజరయ్యారు.

ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. పోలీసు విచారణకు వచ్చిన వర్మకు వైసీపీ నేతల నుంచి ఘన స్వాగతం లభించింది. అంతేకాదండోయి… వర్మ వెంట ఏకంగా వైసీపీ దండు కదిలిపోయింది. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు లోని రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మను పోలీసులు విచారించారు. ఈ సందర్బంగా ఒంగోలు లో వర్మకు వైసీపీ నేతలు ఓ రేంజిలో స్వాగతం పలికిన తీరు అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది. అదేదో ప్రధాన మంత్రో… లేదంటే రాష్ట్రపతో వస్తే నేతలంతా క్యూ కట్టి మరి నిలబడి… వర్మకు వైసీపీ నేతలు స్వాగతం పలికారు.

వర్మకు స్వాగత కార్యక్రమానికి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఒంగోలు పార్లమెంటు ఇంచార్జి చెవిరెడ్డి భాస్కర రెడ్డి నేతృత్వం వహించారు. ఇక ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా వున్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద రెడ్డి, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు తదితరులు వర్మకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఇక ద్వితీయ శ్రేణి నేతల సంఖ్యకు అయితే లెక్కే లేదని చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే… అన్నా రాంబాబు ఎవరో వర్మకు తెలియదన్నట్టు… రాంబాబును ముందుకు పిలిచిన చెవిరెడ్డి ఆయనను వర్మకు పరిచయం చేశారు. మొత్తంగా… పోలీసు విచారణకు వచ్చిన వర్మ… విచారణకు ఎలా సహకరించారో తెలియదు గానీ.,.. వైసీపీ శ్రేణుల్లో మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం నింపారు.