చెబితే వింటివ.. కేజ్రీవాల్‌ పై అన్నా హ‌జారే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. తొలి ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే స‌మ‌యానికి బీజేపీ దూసుకుపోయింది. 45 స్థానాల్లో స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌త క‌న‌బ‌రించింది. దీంతో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఆశ‌లు ఉడిగిపోయాయి. మూడోసారి కూడా.. అధికారం త‌మ‌దేన‌ని భావించిన‌.. కేజ్రీవాల్ కు ఢిల్లీ ప్ర‌జ‌లు దూర‌మ‌య్యారు. అస‌లు ఆయ‌న గెలుపే అటు-ఇటుగా ఉండ‌డం మ‌రోదారుణం. ఇక‌, కీల‌క నేత‌లు కూడా వెనుకంజ‌లో ఉన్నారు.

ఈ ప‌రిణామాల‌పై దేశ‌వ్యాప్తంగా అనేక విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. చిత్రం ఏంటంటే.. బీజేపీ గెలిచినందుకం టే కూడా.. ఆమ్ ఆద్మీ ఓట‌మిపైనే ఎక్కువ‌గా చ‌ర్చ‌లు, విశ్లేష‌ణ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. ఢిల్లీ ప్ర‌జ‌ల నాడిని అంచ‌నా వేసినా.. ఫ‌లితం ఇలా ఉంటుందని ఊహించ‌లేద‌ని ప‌లువురు ప్ర‌ముఖులు పేర్కొన్నా రు. ఇక‌, ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ హేతువాది, ఉద్య‌మ నాయ‌కుడు..కేజ్రీవాల్ సుదీర్ఘ అనుబంధం ఉన్న అన్నా హ‌జారే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అధికార దాహంతోనే కేజ్రీవాల్‌ ఓడిపోయారని దుయ్య‌బ‌ట్టారు. ఆయ‌న అవినీతి, అక్ర‌మాల్లో కేజ్రీవాల్ నిండా మునిగిపోయార‌ని వ్యాఖ్యానించారు. గ‌తంలోనే తాను అనేక సంద‌ర్భాల్లో అవినీతి, అక్ర‌మాల‌పై హెచ్చ‌రించాన‌ని, అయినా త‌న మాట‌ల‌ను ఆప్ ప‌ట్టించుకోలేద‌ని.. గ‌తంలో తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. కేజ్రీవాల్‌పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అద్దాల బంగ‌ళా వ‌ద్ద‌ని చెప్పా. సామాన్యుడిగా రాజ‌కీయ ప్ర‌స్తానం ప్రారంభించావు. అలానే ఉండు అని చెప్పా. విన‌లేదు. ఇప్పుడు అనుభ‌వించాలి. త‌ప్ప‌దు అని అన్నా అన్నారు.

మ‌రీ ముఖ్యంగా లిక్క‌ర్ వ‌ద్దంటూ ఉద్య‌మం చేసి.. లోక్‌పాల్ కోసం నిర‌స‌న‌లు చేసిన త‌న శిష్యుడు.. అదే జ‌వాబుదారీ త‌నాన్నిప‌క్క‌న పెట్టార‌ని విమ‌ర్శించారు. లిక్క‌ర్ కుంభ‌కోణంలో నిలువునా మునిగిపోయి.. జైలుకు వెళ్లినా.. ఆత్మ ప‌రిశీల‌న చేసుకోలేద‌న్నారు. అందుకే కేజ్రీవాల్‌ను ప్రజలు ఓడించారని అన్నా హజారే పేర్కొన్నారు. పార్టీ పెట్ట‌డం గొప్ప విష‌యం కాదు. రాజ‌కీయాల్లో నిలదొక్కుకునేందుకు.. చేయాల్సిన ప‌నిచేయ‌క‌పోతే.. ఫ‌లితం ఇలానే ఉంటుంది అని వ్యాఖ్యానించారు.