కేసీఆర్ అండ్ కో అరెస్టులపై సీఎం రేవంత్ ఏమన్నారు?

మిగిలిన సంగతులు ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో ఒక సుగుణం ఉంటుంది. ఆయన్ను కలవటం.. టైం దొరకబుచ్చుకోవటం కష్టం కావొచ్చు. కానీ.. ఒకసారి కలిసిన తర్వాత.. ఆయన మాట్లాడే తీరు.. ఓపెన్ గా వ్యవహరించే విధానం మనసును దోచుకునేలా ఉంటుంది. ముఖ్యమంత్రి అన్న అహంభావం మచ్చుకు కనిపించదు.

ఏం అడిగినా.. సమాధానం ఇచ్చే ధోరణి కనిపిస్తుంది. మీడియావారికి సైతం ఇది వర్తిస్తుంది. విడిగా ఆయన్ను కలవాలన్నా.. ఆయనతో భేటీకి కూర్చోవాలన్న చుక్కలు కనిపిస్తాయి. కానీ.. ఆయనకు ఆయన కలవాలని డిసైడ్ అయిన తర్వాత మాత్రం పరిస్థితులన్ని ఇట్టే మారిపోతుంటాయి.

తాజాగా ఢిల్లీ మీడియా వర్గాలతో ఇష్టాగోష్ఠిని ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై ఓపెన్ గా మాట్లాడారు. అడిగిన ప్రతి ప్రశ్నకు బదులిచ్చిన ఆయన మాటలు కొన్ని ఆసక్తికరంగా మారాయి. ప్రతిపక్ష నేతలపై కేసులు.. అరెస్టులు ఉంటాయా? అన్న ప్రశ్నకు ఆయన అంతే సూటిగా బదులిస్తూ.. అరెస్టుల విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటామన్నారు. అర్జెంట్ గా అరెస్టు చేసి జైల్లో వేయాలన్న ఆలోచన తనకు లేదన్న రేవంత్.. ఫార్ములా ఈ రేసులో కేసులో లండన్ కంపెనీకి నోటీసులు ఇచ్చామని.. వారు సమయం అడిగినట్లుగా చెప్పారు.

వారిస్టేట్ మెంట్ రికార్డు చేసిన తర్వాత పర్యవసానాలు ఉంటాయన్న రేవంత్.. కేటీఆర్ అరెస్టు ఆగిపోవటంపైనా స్పందించారు. పకడ్బందీగా ఆధారాలు లేకుండా అరెస్టు అయితే బెయిల్ పై బయటకు వస్తారని చెప్పిన వైనం చూస్తే.. అరెస్టుకు తొందర లేదని.. బిగించే ఉచ్చు పక్కాగా ఉండాలన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. రేవంత్ సర్కారుకు భారీ ఎదురుదెబ్బగా భావిస్తునన పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపైనా స్పందించారు. సుప్రీంకోర్టు ఏం చెబుతుందో చూస్తామన్న రేవంత్.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య గతంలో రహస్య స్నేహం ఉండేదని.. అదిప్పుడు బాహాటంగానే కనిపిస్తుందన్నారు. అందుకే ఢిల్లీకి వచ్చిన మాజీమంత్రి కేటీఆర్ ఇద్దరు కేంద్ర మంత్రుల్ని కలిసిన వైనాన్ని ప్రస్తావించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కన్వెర్టెడ్ ఓబీసీగా పేర్కొన్న రేవంత్.. ముఖ్యమంత్రి అయ్యాక తన కులాన్ని మార్చుకున్నట్లు పేర్కొన్నారు. ఓబీసీల గురించి తనకు పాఠాలు చెప్పే అర్హత బీజేపీకి లేదన్న ముఖ్యమంత్రి.. “కిషన్ రెడ్డి ఓబీసీ అయిన దత్తాత్రేయ స్థానంలో పోటీ చేశారు. మరో ఓబీసీ అయిన బండి సంజయ్ స్థానంలో పార్టీ అధ్యక్షుడిగా వచ్చారు. ఆ ఇద్దరి ఓబీసీ నేతల స్థానాల్ని లాక్కున్నది కిషన్ రెడ్డే. ఆంధ్రాలో కాపు అధ్యక్షుడ్ని తీసేసి అగ్రవర్ణానికి చెందిన వారిని నియమించారు. వీళ్లా ఓబీసీలకు అన్యాయం జరిగిందని మాట్లాడేది” అంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తీన్మార్ మల్లన్న ఏం ఆశించి వ్యతిరేకిస్తు్నారో తనకు తెలీదన్న రేవంత్.. బహుశా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తాడేమోనని వ్యాఖ్యానించటం గమనార్హం.