తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీళ్లు చల్లేశారు. ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణ లేదని ఆయన శుక్రవారం తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్.. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించారు. అందులో భాగంగా ఆయన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ ను కూడా కలిశారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణఫై స్పష్టత వచ్చింది.
ఇప్పటికిప్పుడు మంత్రివర్గ విస్తరణ లేదన్న రేవంత్ రెడ్డి.. పీసీసీ పునర్వ్యవస్తీకరణ మాత్రం ఉంటుందని చెప్పారు. పీసీసీ షఫిలింగ్ త్వరలోనే ఉంటుందని… ఇప్పటికే దానికి సంబందించిన కసరత్తు పూర్తి అయ్యిందని కూడా రేవంత్ చెప్పారు. పీసీసీ పునర్వ్యవస్తీకరణ, కేబినెట్ పునర్వ్యవస్తీకరణ ఒకే సమయంలో ఉంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుందన్న భావనతో కేబినెట్ పునర్వ్యవస్తీకరణను వాయిదా వేసినట్టు సమాచారం.
కేబినెట్ పునర్వ్యవస్తీకరణ వాయిదా పడటంతో ఆశావహులు నీరుగారిపోయినా.. కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని భావించిన వారు మాత్రం ఊపిరి పీల్చుకున్నారని చెప్పక తప్పదు. రేవంత్ కేబినెట్ ఏర్పడి అప్పుడే ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది కాలంలో పలువురు మంత్రులపై లెక్కలేనన్ని వివాదాలు వచ్చాయి. కొండా సురేఖ అయితే… ఎప్పుడు కేబినెట్ పునర్వ్యవస్తీకరణ ఉన్నాఆమెపై వేటు ఖాయమన్న వాదనలు వినిపించాయి. అయితే… ఇప్పుడు కేబినెట్ విస్తరణ వాయిదా పడటంతో సురేఖతో పాటు… వేటు పడుతుందని భావిస్తున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.