వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని సాయిరెడ్డి చెప్పారు. అంతేకాదు, రాజకీయ సన్యాసం తర్వాత ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నుతా అని చెప్పడమే కాకుండా..ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు సాయిరెడ్డి. అయితే, సాయిరెడ్డి రాజీనామాపై ఇప్పటి వరకు ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించలేదు. తాజాగా నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒకరికి భయపడో..కేసులు పెడతారన్న బెదిరింపులకు తలొగ్గో..ఇంకో కారణం చేతనో పార్టీ వీడే వారికి గౌరవం, క్యారెక్టర్, వాల్యూ ఏముంటాయని జగన్ ప్రశ్నించారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని, అధికారం ఐదేళ్లు మాత్రమే ఉంటుందని, ఐదేళ్లు ఓర్చుకుంటే సరిపోతుందని చెప్పారు. సాయిరెడ్డికైనా, పార్టీని వీడి బయటకు వెళ్లిన ముగ్గురికైనా అదే వర్తిస్తుందని జగన్ అన్నారు.
పోయే ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెబుతున్నానని, కాలర్ ఎగరేసుకుని ఫలనా వ్యక్తి తమ నాయకుడు అని చెప్పుకునేలా మనం ఉండాలని అన్నారు. తన గురించైనా…తమ ఎమ్మెల్యే, ఎంపీల గురించి కేడర్ అలాగే చెప్పుకోవాలని తెలిపారు.
అయితే, పార్టీ వీడొద్దని జగన్ చెప్పినా వినకుండా సాయిరెడ్డి రాజీనామా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. జగన్ విదేశీ పర్యటనలో ఉండగా హడావిడిగా సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం జగన్ కు నచ్చలేదట. ఈ క్రమంలోనే తాజాగా సాయిరెడ్డి రాజీనామాపై జగన్ ఈ విధంగా స్పందించారని తెలుస్తోంది. అయితే, గతంలో కూడా పార్టీని కొందరు నాయకులు వీడగా…జగన్ ఇదే తరహా కామెంట్లు చేశారు. పోయేవారిని ఆపబోనని అన్నారు. నాయకుల వల్ల వైసీపీ నిలబడలేదని, దేవుడి ఆశీస్సులు, ప్రజల మద్దతుతోనే నిలబడిందని జగన్ చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates