వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు.. ఆమె వ్యక్తిగత కార్యదర్శులు ఇద్దరు.. రామకృష్ణ, ఫణి, అప్పటి సీఐ సూర్యనారాయణపై కేసు నమోదు చేయాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. తమకు సమర్పించాలని కూడా న్యాయమూర్తులు పోలీసులను ఆదేశించారు. ఈ వ్యవహారం.. వైసీపీలో సంచలనంగా మారింది. ఇప్పటి వరకు రాష్ట్ర పోలీసులు మాత్రమే గాడి తప్పిన వైసీపీ నేతలపై కేసులు పెట్టారు.
పల్నాడు జిల్లాలో ఎస్సీ మహిళ మరియమ్మ హత్య కేసులో అప్పటి ఎంపీ నందిగం సురేష్ సహా.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై మరికొందరిపై కేసులు పెట్టి జైళ్లకు పంపించారు. కానీ, ఫస్ట్ టైమ్.. వైసీపీ మహిళా నాయకురాలు, మాజీ మంత్రి రజనీ పై హైకోర్టు నేరుగా కేసు పెట్టమని ఆదేశించడంతో వైసీపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. దీంతో గుంటూరు జిల్లా పల్నాడు పోలీసులు 24 గంటల్లో ఎఫ్ ఐఆర్ నమోదు చేసి.. కోర్టుకు సమర్పించాల్సి వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేకుండా హైకోర్టు పక్కా ఆదేశాలు జారీ చేయడం విశేషం.
ఏం జరిగింది?
వైసీపీ హయాంలో అప్పటి జగన్ పాలనపై కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. గత చంద్రబాబు పాలనతో పోల్చుతూ.. అనేక విషయాలను వారు విమర్శించేవారు. ఇలానే మంత్రిగా రజనీ చేసిన పనులు కూడా విమర్శలకు గురయ్యాయి. ఈ క్రమంలో ఆమె అప్పటి సొంత నియోజకవర్గం చిలకలూరిపేటకు చెందిన పిల్లి కోటి అనే వ్యక్తి కూడా ఇలానే మంత్రిని ప్రశ్నిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై ఆగ్రహించిన రజనీ.. ఆయనను తక్షణం అరెస్టు చేయాలని పోలీసులకు చెప్పడంతోపాటు తగిన విధంగా శిక్షించాలని ఆదేశించారు.
దీంతో మంత్రి గారి ఆదేశాలను పోలీసులు తు.చ. తప్పకుండా పాటించారు. కోటిని స్టేషన్‌ను తరలించి.. చిత్రహింసలు పెట్టారని ఆయన కుటుంబం ఆరోపించడం.. ప్రధాన మీడియాలో రోజుల తరబడి వార్తలు రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. మొత్తంగా చిలకలూరిపేట పోలీసు స్టేషన్‌లో ఐదురోజులపాటు చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పుడు కోటి.. నేరుగా హైకోర్టును ఆశ్రయించి అప్పటి మంత్రి రజనీ, ఆమె వ్యక్తిగత కార్యదర్శులపై ఫిర్యాదులు చేశారు. దీనిని విచారించిన కోర్టు.. మాజీ మంత్రి విడదల రజినితోపాటు ఆమె పీఏలు రామకృష్ణ, ఫణి, అప్పటి సీఐ సూర్యనారాయణపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. ముందు ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని.. రెండు వారాల్లోగా కేసు వివరాలను తమకు అందించాలని గుంటూరు జిల్లా పల్నాడు పోలీసులకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.