అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వంటి నేతలకైతే అనూహ్యంగా వచ్చిన అధికారం తెచ్చిన అతి విశ్వాసం అందరికన్నా అరకిలో ఎక్కువే ఉంటుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్ చేసిన క్లాసిక్ కామెంట్లు ఇందుకు నిదర్శనం. రాబోయే 30 ఏళ్లు వైసీపీ ప్రభుత్వమే..సింహం సింగిల్ గానే పోటీ చేస్తుంది…వారంతా కట్టగట్టుకొని వచ్చినా నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ కూటమి పార్టీల నేతలనుద్దేశించి జగన్ చేసిన కామెంట్లు అప్పట్లో వైరల్ అయ్యాయి.
కట్ చేస్తే…వై నాట్ 175 అన్న జగన్ కు వై 175 అంటూ 11 సీట్లకే పరిమితం చేశారు ప్రజలు. అయినా సరే జగన్ తీరు మారలేదు. చింత చచ్చినా పులుపు చావలేదు అన్న చందంగా కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచి బొక్కబోర్లా పడ్డ తర్వాత కూడా జగన్ ఇంకా వెంట్రుకలు పీకడం మానలేదు. “వైసీపీ బ్రతుకుతుంది…మరో 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది…ఎవ్వరూ కూడా వైసీపీ కార్యకర్త వెంట్రుక కూడా పీకలేరు” అంటూ జగన్ తాజాగా చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.
తనపై దొంగ కేసులు బనాయించి 16 నెలలు జైల్లో పెట్టారని…వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఆ తర్వాత బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యానని విజయవాడలో వైసీపీ కార్పొరేటర్లు, నేతలతో జరిగిన సమావేశంలో జగన్ చెప్పారు. వైసీపీ కార్యకర్తలను, నేతలను జైల్లో పెట్టిన వారిని గుర్తు పెట్టుకుంటామని వార్నింగ్ ఇచ్చారు జగన్. ఈ సారి జగనన్న 2.0 కొంచెం వేరుగా ఉంటుందని…కార్యకర్త కోసం ఎలా పని చేస్తానో చూపిస్తానని చెప్పారు.
జగన్ 1.0 లో కార్యకర్తలను పట్టించుకోలేదని, తన ధ్యాసంతా ప్రజలు..పథకాలపైనే ఉందని జగన్ అంగీకరించారు. కూటమి హయాంలో కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు చూస్తున్నానని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టినవారిని వదిలిపెట్టనని, ఎక్కడున్నా తెచ్చి చట్టం ముందు నిలబెడతానని చెప్పారు. ఇక, వైసీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినవారిపై ప్రైవేట్ కేసులు వేస్తామని జగన్ అన్నారు. మళ్లీ మనం అధికారంలోకి వస్తున్నామని, 30 ఏళ్లు అధికారంలో ఉంటామని కార్యకర్తలకు భరోసానిచ్చారు జగన్.
ఈ కామెంట్ల నేపథ్యంలో వెంట్రుకలు పీకడం ఆపని జగన్ అంటూ సోషల్ మీడియాలో జగన్ పై ట్రోలింగ్ జరుగుతోంది. 2024 ఎన్నికల ముందు కూడా జగన్ సేమ్ టు సేమ్ డైలాగులు కొట్టారని, కానీ, ఫలితం డిజాస్టర్ అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇకనైనా..ఈ తరహా ఊహలు, డైలాగుల నుంచి బయటకు వచ్చి వాస్తవాలపై ఫోకస్ చేస్తే రాబోయే ఎన్నికల్లో 11 కంటే కాస్త ఎక్కువ సీట్లు వచ్చే చాన్స్ ఉందని, లేదంటే అవి కూడా రావని సెటైర్లు వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates