ఓటమి కాస్తా.. ఓదార్పు యాత్ర అయ్యిందే!

తిరుపతి నగరపాలక సంస్థలో మంగళవారం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తి అయిపోయిన తర్వాత ఎందుకనో గానీ వైసీపీలో ఏడుపులు, పెడబొబ్బలు, క్షమాపణలు… ఒకదాని తర్వాత మరొకటి క్యూ కడుతున్నాయి. వాస్తవానికి తిరుపతి కార్పొరేషన్లో వైసీపీకి బలం ఉంది. అయితే ఆ పార్టీ నేతలు తమ కార్పొరేటర్లను తమ పంచన ఉండేలా చేసుకోలేకపోయారు. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా… అవసరం తీరాక మరోలా అన్నట్టుగా వ్యవహరించారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నిక పూర్తి అయ్యాక వరుసగా జరుగుతున్నా పరిణామాలే ఇందుకు దోహదం చేస్తున్నాయి.

మంగళవారం అత్యంత భద్రత మధ్య జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికలో మైనారిటీగా ఉన్న టీడీపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. మెజారిటీ ఉన్న వైసీపీ చతికిలబడింది. వైసీపీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు ఓటేశారు. ఇక టీడీపీ కిడ్నప్ చేసిందని ఆరోపించిన ఆ పార్టీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఓటింగుకు దూరంగా ఉన్నారు. టీడీపీ తమ ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసిందని వైసీపీ కీలక నేత భూమన కరుణాకర రెడ్డి ఆరోపిస్తే.. అబ్బే అదేమీ లేదు.. తాను ఇంటిలోనే ఉన్నానని.. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని సుబ్రహ్మణ్యం చెప్పారు. అనారోగ్యం వల్ల తాను బయటకు రాలేదని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. బుధవారం సుబ్రహ్మణ్యం నేరుగా కరుణాకర రెడ్డి ఇంటిలో ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్బంగా భూమనకు ఆయన సారీ చెప్పారు. అనారోగ్యం వల్ల ఓటింగ్ కు రాలేకపోయానని సంజాయిషీ ఇచ్చారు. తనను అపార్థం చేసుకోవద్దని కూడా ఆయన భూమనను వేడుకున్నంత పని చేశారు. వాస్తవానికి సుబ్రహ్మణ్యం రాయలసీమలోనే పేరు మోసిన వైద్యులు. ఈ విషయాన్నీ మంగళవారం భూమననే వెల్లడించారు కూడా. మరి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఓ గోలీ మాత్రా వేసుకుని ఓటింగ్ కు ఆయన వెళ్లలేక పోయారా అన్నది ఇప్పుడు అందరిని తొలుస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్న భూమనకు కూడా తట్టే ఉంటుంది కానీ.. నేరుగా తన ముందు కూర్చున్న సుబ్రహ్మణ్యంను అడగలేరు కదా.

ఇదిలా ఉంటే… మంగళవారం ఆలా ఓటింగ్ అయిపోయిందో లేదో ఇలా ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు పరుగు పరుగున వచ్చి భూమన, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి కాళ్లపై పడి శోకాలు తీస్తూ పెడబొబ్బలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలు వైరల్ కూడా అయ్యాయి. తమను టీడీపీ నేతలు కిడ్నాప్ చేసి.. తీవ్రంగా కొట్టారని… ఆ దెబ్బలకు తట్టుకోలేకే తాము కూటమి అభ్యర్థికి ఓటు వేయాల్సి వచ్చిందని చెప్పారు. నిన్న ముగ్గురు కార్పొరేటర్లు … నేడు ఓ ఎమ్మెల్సీ ఇలా మన పార్టీ అభ్యర్థికి ఓటు వేయలేకపోయామని చెబుతున్న తీరు చూస్తుంటే… భూమన అండ్ కో తమ ఓటమిని ఇలా ఓదార్పు యాత్రగా మారుస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.