స్థానిక సంస్థలకు సంబంధించి చైర్ పర్సన్, డిప్యూటీ మేయర్ పదవులకు సంబంధించిన పోటీ తీవ్రస్థాయిలో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 పదవులకు.. ఒక డిప్యూటీ మేయర్(తిరుపతి) పదవికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూటమిని ముందుకు నడిపిస్తున్న టీడీపీ ఆయా పదవులను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో జనసేన ఎక్కడా పోటీ కూడా ఇవ్వలేదు. దీంతో జనసేన స్థానిక పోటీలో తప్పుకొందా? లేక.. మరేదైనా జరిగిందా? అనే చర్చ జరుగుతోంది.
స్థానికంలో జరిగిన పదవుల వేటలో టీడీపీ నేతలు ముందున్నారు. పైగా.. ఇప్పుడు తిరిగి ఘర్ వాపసీ వచ్చిన వారు కూడా కొందరు ఉన్నారు. దీంతో టీడీపీ వైపు మొగ్గు ఎక్కువగా కనిపించింది. ఇక, జనసేన విషయానికి వస్తే.. క్షేత్రస్థాయిలో పుంజుకున్నాక.. ఇలాంటి పదవులు తీసుకుంటే బెటర్ అన్న ఆలోచన తోనే స్థానిక పోరు నుంచి తప్పుకొన్నట్టు తెలుస్తోంది. దీంతో క్షేత్రస్థాయిలో నాయకులు మౌనంగా ఉండిపోయారు.
తిరుపతి నుంచి నందిగామ వరకు.. కీలకమైన స్థానాల్లో వివాదాలు చోటు చేసుకున్నా ఎక్కడా జనసేన పేరు వినిపించలేదు. ఆ పార్టీ నాయకులు కూడా కనిపించలేదు. ఇక, మరో పక్షం బీజేపీ కూడా ఎక్కడా స్పందించలేదు. ఈ రెండు పార్టీల నాయకులు కూడా మౌనంగానే ఉన్నారు. దీంతో టీడీపీ తరఫున కొంత హడావుడి కనిపించింది. దీంతోనే ఎక్కడా ఎలాంటి అంతర్గత కుమ్ములాటలు లేకుండానే టీడీపీ నేతలు పగ్గాలు చేపట్టారు.
ఇదిలావుంటే.. ఆది నుంచి కూడా స్థానికంపై పెద్దగా జనసేన దృష్టి పెట్టలేదు. పైగా ఎవరూ కూడా ఆశ పడినట్టు వార్తలు రాలేదు. కానీ, అంతర్గతంగా చర్చ అయితే జరిగింది. దీనికి పార్టీ అధినేత నుంచి సరైన సుముఖత రాకపోగా.. నాయకులు ఈ విషయంలో మౌనంగా ఉండాలని సూచించారు. ఫలితంగా.. జనసేన ఎక్కడా స్థానికంగా పోటీకి కానీ.. వివాదాలకు కానీ.. ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఇది టీడీపీకి అంతర్గతంగా కలిసి వచ్చిన పరిణామం.