తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన కుల గణన, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బాగానే ఉందన్న ఆయన.. కుల గణనపై మాత్రం విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వన్నీ డ్రామాలేనని చెప్పారు. కుల గణన పేరుతో బీసీ డిక్లరేషన్ చేసినా.. దానిని అమలు చేసే చిత్త శుద్ధి ఏమాత్రం ఈ ప్రభుత్వానికి లేదని విమర్శలు గుప్పించారు.
బీసీ డిక్లరేషన్‌పై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదన్నారు. తమకే స్పష్టత లేని ఓ తీర్మానం చేసి.. దీనిని కేంద్రంపై రుద్దడం ద్వారా బీసీలను మాయ చేస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి ఇది ఎలా సాధ్యమో చెప్పాలన్నారు. వాస్తవానికి ఇతర సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేయాల్సి ఉందని.. అలాంటప్పుడు దీనిని ఎలా అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
దీనిని అమలు చేయలేక.. డ్రామాలు ఆడుతున్నారని రేవంత్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. కేంద్రం దగ్గరకు పంపిస్తున్నామని.. అక్కడ ఆమోదం పొందితే వెంటనే అమలు చేస్తామని చెబుతున్నారని.. కానీ, కేంద్రం ఈ అసంబద్ధ తీర్మానానికి ఆమోదం తెలుపుతుందా? అని ప్రశ్నించారు. ఇవన్నీ తెలిసి కూడా రేవంత్ రెడ్డి కుల గణన పేరుతో గిమ్మిక్కులకు తెరదీశారని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ తనపేరును ఎన్నికల గాంధీగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు.
కాగా.. మంగళవారం తెలంగాణ ప్రభుత్వం కులగణన, ఏక సభ్య కమిషన్ ఇచ్చిన ఎస్సీ రిజర్వేషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. దీనిపై సుదీర్ఘ చర్చ కూడా సాగింది. అనంతరం.. వీటిని కేంద్రానికి పంపించనున్నారు. అయితే.. వీటిలో కుల గణన ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందని సీఎం చెప్పారు. కానీ, కేటీఆర్ మాత్రం ఇది ప్రయోజనం లేదని కేవలం గిమ్మిక్కేనని ఎద్దేవా చేయడం గమనార్హం.