“ఫిబ్రవరి 4వ తేదీ నా రాజకీయ జీవితంలో ప్రత్యకంగా గుర్తుండిపోయే రోజు” అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం సాయంత్రం ఆయన అసెంబ్లీలో కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణపై వేసిన ఏకసభ్య కమిషన్ నివేదికపై సుదీర్ఘంగా ప్రసంగించారు. అదేవిధంగా కుల గణన నివేదికను కూడా సభకు మరోసారి వివరించారు. ఈ రెండు అంశాలు కూడా.. తనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని.. వాటినిసభలో ప్రవేశ పెట్టిన ఫిబ్రవరి 4వ తేదీ మరింత ప్రాధాన్యం సంతరించుకున్న రోజుగా రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఎందరో ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్నిపాలించినా.. వారెవరికీ రాని అవకాశం తనకు లభించిందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకే రోజు ఎస్సీ వర్గీకరణ, కుల గణనలను సభకు సమర్పించే అవకాశం అరుదైన అంశంగా పేర్కొన్నారు. ఒకప్పుడు వర్గీకరణను రాజకీయ అంశంగానే చూశారంటూ.. గత పాలనపై విమర్శలు గుప్పించారు. కానీ, తాము ఎంతో నిబద్ధతతో ఎస్సీలకు న్యాయం చేయాలన్న ఏకైక తలంపుతో సుప్రీంకోర్టు ఆదేశాలు, తీర్పు మేరకు.. ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేసి.. వారికి న్యాయం చేసే దిశగా అడుగులు వేసినట్టు తెలిపారు. 40-50 ఏళ్ల సమస్యను పరిష్కరించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామ న్నారు.
ఎస్సీల్లో 59 ఉప కులాలను ఏబీసీలుగా వర్గీకరించారని తెలిపారు. దీంతో వారికి రాజ్యాంగ, సంక్షేమ ఫలాలు చేరువ అవుతాయ ని సీఎం చెప్పారు. అన్ని వర్గాలనుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని,మేధావుల సూచనలను కూడా ఏకసభ్య కమిషన్ తన నివేదికలో పొందు పరిచిందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నివేదిక అమలైతే.. రాష్ట్రంలో ఎస్సీలకు మెరుగైన జీవితం చేరువ అవుతుందన్నారు. ఇక, కుల గణన కూడా.. రికార్డు అంశంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో వెనుక బడిన వర్గాలు తరతరాలుగా అలానే ఉండిపోతున్నాయని.. ఇప్పుడు వారికి న్యాయం చేసేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఈ విషయంలో ఎంతో కృషి జరిగిందని.. అన్ని అభిప్రాయాలకు ప్రాధాన్యం ఉందని సీఎం చెప్పారు.