ప్ర‌జల సంతృప్తి.. చంద్ర‌బాబు అసంతృప్తి!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న ప్రారంభించి.. ఏడు మాసాలు పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఏమనుకుంటున్నారు? ఫీడ్ బ్యాక్ ఏంటి? అనే అంశాల‌పై సీఎం చంద్ర‌బాబు తాజాగా ఉన్న‌తాధికారుల తో స‌మీక్షించారు. ప్ర‌జ‌ల సంతృప్తి వ్య‌వ‌హారంపై ఆయ‌న ఆరా తీశారు. పెట్టుబ‌డులు, ఉద్యోగాల క‌ల్ప‌న‌, దావోస్ స‌ద‌స్సు, పింఛ‌న్ల పంపిణీ, ఉచిత గ్యాస్‌, ర‌హ‌దారుల నిర్మాణం, ధాన్యం సేక‌ర‌ణ‌, నిధుల పంపిణీ త‌దిత‌ర అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల సంతృప్తిని తెలుసుకున్న చంద్ర‌బాబు.. మ‌రింత‌గా సంతృప్తి పెరిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారులను ఆదేశించారు.

పథకాల అమ‌లు విషయంలో ఎక్కడా అలసత్వం, అవినీతి, నిర్లక్ష్యం కనిపించకూడదని చంద్ర‌బాబు తెలిపారు. ప్రజల సంతృప్తిని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుని దాని ఆధారంగా మార్పులు చేసుకుని పనిచేయాలని జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను ఆయ‌న ఆదేశించారు. పింఛన్ల పంపిణీ, అన్న క్యాంటీన్ ప‌నితీరు వంటివాటిపై ప్ర‌జ‌ల నుంచి 80-90 శాతం మ‌ధ్య సంతృప్తి వ్య‌క్త‌మైంది. ఇక‌, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై మిశ్ర‌మ సంతృప్తి వ్య‌క్త‌మైంది. ధాన్యం కొనుగోలు, నిధుల పంపిణీపై రైతులు సంతోషంగానే ఉన్నారు. ఆయా విష‌యాల‌ను అధికారులు సీఎం చంద్ర‌బాబుకు వివ‌రించారు.

అయితే.. సంతృప్తి స‌మ‌పాళ్ల‌లో లేద‌ని.. చంద్ర‌బాబు అసంతృప్తి వ్య‌క్తం ఏశారు. ప్రజల నుంచి ఐవిఆ ర్ఎస్, క్యూఆర్ కోడ్ స్కానింగ్ తో పాటు పలు మార్గాల్లో చేప‌ట్టిన‌ సర్వేల‌లో ఖ‌చ్చిత‌మైన రిజ‌ల్ట్ వ‌చ్చింద‌ని.. వారి అసంతృప్తికి కార‌ణంపై దృష్టి పెట్టాల‌ని కూడా చంద్ర‌బాబు సూచించారు. మ‌రింత మెరుగ్గా ప‌నితీరు ఉండాల‌ని.. ఫిర్యాదులు, ఫీడ్ బ్యాక్ పై సమగ్రంగా విచారించి పనితీరు మెరుగుపరుచుకోవాలని తెలిపారు.

“ఒకే ఒక‌ వ్యక్తి పింఛను ఇంటికి వ‌చ్చి ఇవ్వ‌డం లేద‌ని చెప్పినా.. దీపం పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ డెలివరీలో సమస్యలు వచ్చినా, లంచాలు అడిగినా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాలి. ప్ర‌జ‌లు సంతృప్తిగా ఉన్నా ర‌ని మీరు చెబుతున్నా.. సేవ‌ల‌ను ప‌రిశీలిస్తే.. ఇంకా మెరుగు ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అనిపిస్తోంది.” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. సుమారు మూడు గంట‌ల పాటు ఈ సమీక్ష సాగ‌డం గ‌మ‌నార్హం.