వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్.. లండన్ నుంచి ఇలా వచ్చారో లేదో.. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు, ఆయన సోదరి షర్మిల.. ఇలా ఏకేయడం ప్రారంభించారు. తాజాగా మంగళవారం.. షర్మిల విజయవాడలో మాట్లాడుతూ.. జగన్‌పై విమర్శల జల్లు కురిపించారు. బీజేపీ దత్తపుత్రుడు.. ఆ పార్టీ కనుసన్నల్లో నడిచాడు
అంటూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు.. ఈ విషయంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా ఆమె సూచించడం గమనార్హం. అయితే.. విషయం ఏదైనా జగన్‌ను ఏకేయడం కామన్ అన్నట్టుగా షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించడం గమనార్హం.
విషయం ఇదీ..
తెలంగాణలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తాజాగా కులగణన రిపోర్డును వెల్లడించింది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టి.. దీనిపై చర్చిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలో మీడియాతో మాట్లాడిన షర్మిల.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణనను అద్భుతమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సమాజంలో వెనుక బడిన వర్గాలను గుర్తించి, వారికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించాలన్న ఏకైక ఉద్దేశంతోనే కులగణను చేపట్టిందని.. తెలంగాణలోనే ఇది ఒక చరిత్రను సృష్టిస్తుందని ఆమె కొనియాడారు. దీనికి తెలంగాణ సర్కారు ఎంతో కష్టపడిందన్నారు.
మరోవైపు.. ఏపీలోని కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు కూడా.. కుల గణన చేపట్టాలని షర్మిల కోరారు. రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగాలలో వెనుక బడిన వర్గాలకు వారి వాటా వారికి దక్కాల్సి ఉందని అన్నారు. జనాభా ప్రాతిపదికన న్యాయంగా రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉందని తెలిపారు కానీ, ఈ విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారుతున్నా ఆయా సామాజిక వర్గాల పరిస్థితి మారడం లేదన్నారు. తెలంగాణ చేసిన కులగణన మోడల్ బాగుందని, దీనిని ఏపీ కూడా అందిపుచ్చుకోవాలని షర్మిల సూచించారు.
అయితే.. గతంలో ఎన్నికలకుముందు వైసీపీ ప్రభుత్వం కూడా కుల గణన పేరుతో హడావుడి చేసిందని.. ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేసిందని షర్మిల దుయ్యబట్టారు. అయితే.. బీజేపీ దత్తపుత్రుడుగా వ్యవహరించిన ఆనాటి ముఖ్యమంత్రి జగన్.. ఈ కుల గణన సర్వేను తొక్కిపెట్టారని.. కనీసం దీనిపై పన్నెత్తు మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. బీజేపీ కనుసన్నల్లో ఆ పార్టీ చెప్పిందన్న కారణంగానే కుల గణన పూర్తయినా.. జగన్ వెల్లడించలేదన్నారు. కానీ, ఇప్పుడు చంద్రబాబు బీజేపీ వలలో చిక్కుకోకుండా.. కుల గణన చేయాలని షర్మిల సూచించారు. కుల గణన చేయడం ద్వారా.. వెనుకబడిన వర్గాలు మేలు చేసినట్టు అవుతుందన్నారు.