వైసీపీ అధినేత జగన్.. లండన్ పర్యటనను ముగించుకుని తాడేపల్లికి చేరుకున్నారు. సుమారు 15-20 రోజుల పాటు ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. అయితే.. జగన్ ఎలాంటి సమావేశాలు నిర్వహించినా.. నిర్వహించకపోయినా.. ఫస్ట్ ఆయన చేయాల్సిన పని ఒకటి ఉందని సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే.. సీనియర్ మోస్ట్ నేతల విషయంలో ఏర్పడిన సమస్యలను ఆయన పరిష్కరించాలని చెబుతున్నారు.
ఇద్దరు సీనియర్ మోస్ట్ నాయకుల వ్యవహారం.. ఒకరు విజయసాయిరెడ్డి. రెండు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. సాయిరెడ్డి పార్టీకి, తన రాజ్యసభ సీటుకు కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో ఆయన ద్వారా ఏర్పడిన గ్యాప్‌ను తక్షణం భర్తీచేయాల్సిన అవసరం ఉంది. పైగా.. ఇప్పుడు ఉత్తరాంధ్రలో కీలక బాధ్యతలు చూసేందుకు ఎవరూ లేరు. ఇదేసమయంలో పార్టీకి కీలక సమయాల్లో.. ఆదుకునేందుకు.. నేషనల్ లెవిల్లో పార్టీ తరఫున వాయిస్ వినిపించేందుకు కూడా ఎవరూ లేరు.
ఈ నేపథ్యంలో సాయిరెడ్డి ప్లేస్ ను తక్షణమే భర్తీచేయాలన్నది కొందరు చెబుతున్న సూచన. ఇక, పుంగనూరు ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ మోస్టు నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సర్కారు కార్నర్ చేస్తున్న విషయం తెలిసిందే. రెండు కేసుల్లో ఆయనపై విచారణ జరుగుతోంది. 1) మదనపల్లె ఫైళ్ల దగ్ధం. 2) అటవీ భూముల ఆక్రమణ, నిర్మాణాలు. ఈ రెండు కేసుల్లోనూ పెద్దిరెడ్డిపై విచారణ అంతర్గతంగా పుంజుకుంది. దీంతో పెద్దిరెడ్డి చిక్కుల్లో పడ్డారు.
పైకి.. కూటమి సర్కారుపై ఆయన విమర్శలుచేస్తున్నా.. అంతర్గతంగా మాత్రం ఆవేదనలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పరంగా ఆయనకు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నది నేతలు చెబుతున్నారు. పెద్దిరెడ్డికే పార్టీలో రక్షణలేకపోతే.. ఆయననే పట్టించుకోకపోతే.. మున్ముందు.. సీనియర్ నాయకులు ఎవరూ బయటకు వచ్చే అవకాశం లేదన్నది కొందరు చేస్తున్న వాదన. ఈ నేపథ్యంలో జగన్ తక్షణమే ఈ రెండు సమస్యల పరిష్కారంపైనా.. దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేయాలన్నది వారి సూచన. మరి ఏమేరకు ఆయన సక్సెస్ అవుతారో చూడాలి.