బీఆర్ఎస్ కు బూస్ట్…వారంతా రిప్లై ఇచ్చి తీరాల్సిందే

తెలంగాణలో జోరుగా సాగుతున్న పార్టీ ఫిరాయింపులకు చెక్ పడే దిశగా మంగళవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పరిణామం విపక్ష బీఆర్ఎస్ కు బిగ్ బూస్ట్ ఇచ్చిందని చెప్పక తప్పదు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్లపై అసెంబ్లీ బరిలో నిలిచి ఎమ్మెల్యేలుగా గెలిచి… ఆ తర్వాత అదికార కాంగ్రెస్ గూటికి చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఎందుకు మారారన్న విషయంపై లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని కార్యదర్శి సదరు నోటీసుల్లో ఎమ్మెల్యేలను కోరారు.

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కూడా భారీ ఎత్తున పార్టీ ఫిరాయింపులకు పాల్పడిందన్న ఆరోపణలు లేకపోలేదు. నాడు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని బీఆర్ఎస్ తనలో చేర్చుకుంది. ఈ సందర్భంగా వారితో బీఆర్ఎస్ ఎలాంటి రాజీనామాలు చేయించకుండానే తనలో చేర్చుకుంది. ఆ తర్వాత 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి పిరాయింపులు పోటెత్తాయి. గడచిన ఏడాది కాలంలోనే బీఆర్ఎస్ కు చెందిన దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు గులాబీ గూటిని వదిలేసి హస్తం గూటికి చేరారు.

ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్… పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ సదరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ ను కోరింది. అయితే స్పీకర్ నుంచి నిర్ణీత వ్యవధిలోగా సమాధానం రాని నేపథ్యంలో బీఆర్ఎస్ నేరుగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ కు చెందిన నేతల ద్వారా 3 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ సందర్భంగా సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారన్న సమాధానంపై విరుచుకుపడిన కోర్టు… గడువు అంటే మహారాష్ట్రలో మాదిరిగా అసెంబ్లీ గడువు తీరిపోయాకా;? అంటూ నిలదీసింది.

పార్టీ ఫిరాయింపులపై సుప్రీం ఆగ్రహం నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయం మేల్కొంది. పార్టీలు మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల జారీ కూడా సరిగ్గా… కుల గణనపై చర్చ కోసం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయిన మంగళవారమే జారీ చేస్తూ కార్యదర్శి వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఎలాగూ ప్రత్యేక సమావేశాల కోసం ఎమ్మెల్యేలంతా సమావేశాలకు వస్తారన్న భావనతో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అక్కడే నోటీసులు జారీ చేస్తే సరిపోతుంది కదా అన్న భావనతోనే కార్యదర్శి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అయితే ఈ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు తమకు కొంత సమయం కావాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలు కార్యదర్శిని కోరినట్లు సమాచారం. అయితే ఈ గడువు ఎంత అన్న దానిపై మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.