రాజకీయ సన్యాసం తీసుకున్న వైసీపీ మాజీ విజయసాయిరెడ్డికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ విషయం నిజంగానే అమితాసక్తి రేకెత్తిస్తోంది. పల్నాడు పులిగా పేరుగాంచిన టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ దివంగత డాక్టర్ కోడెల శివప్రసాదరావు… సాయిరెడ్డికి చేసిన సాయం గురించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తి రేకెత్తిస్తోంది. కోడెల నుంచి సాయం అందుకున్న సాయిరెడ్డి…అదే కోడెల కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం ఆయన ఫోన్ ను కూడా లిఫ్ట్ చేయని వైనం సాయిరెడ్డి మనస్తత్వాన్ని బయటపెట్టింది.
కోడెల, సాయిరెడ్డిల మధ్య ఏం జరిగిందన్న విషయానికి వస్తే. . టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే సాయిరెడ్డి తొలి సారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో జరిగిన రాజ్యసభ సీట్ల భర్తీలో భాగంగా వైసీపీకి దక్కిన ఏకైక సీటును సాయిరెడ్డికే దక్కింది. ఈ సీటు కోసం సాయిరెడ్డి అభ్యర్థిత్వాన్ని జగన్ ఖరారు చేయగా… నాడు ఏపీ అసెంబ్లీలో సాయిరెడ్డి నామినేషన్ వేశారు. ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అసెంబ్లీ సెక్రటరీ… సాయిరెడ్డి నామినేషన్ ను పరిశీలించి.. నిబంధనలకు విరుద్ధంగా వుందని దానిని తిరస్కరించాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సాయిరెడ్డి బెంబేలెత్తిపోయారు. వైసీపీ నుంచి తొలి రాజ్యసభ సభ్యత్వాన్ని జగన్ తనకు కట్టబెడితే… తానేమో హడావిడి పడి చేజార్చుకుంటానా? అని మదనపడిపోయారట.
అలాంటి సమయంలో తనను ఈ సమస్య నుంచి గట్టెక్కించేది ఒక్క కోడెల మాత్రమేనని సాయిరెడ్డి గ్రహించారు. ఇంకేముంది… పరుగు పరుగున కోడెల వద్దకు చేరిన సాయిరెడ్డి…మీరే రక్షించాలి అంటూ ప్రాధేయపడ్డారట. అసలేం జరిగిందో చెప్పమంటే… నామినేషన్ పత్రాల్లో తాను ఓ చోట సంతకం చేయలేదని… ఆ కారణంగా తన నామినేషన్ ను తిరస్కరిస్తున్నారని చెప్పారట. రాజకీయంగా ఎన్ని ఉన్నా… ఇలాంటి ఆపద సమయంలో ఒకరిని మరొకరు కాపాడుకోవాలి కదా అంటూ సాయిరెడ్డి అన్నారట. తన ఎదుటకు వచ్చి మరీ సాయిరెడ్డి ప్రాధేయపడటంతో కరిగిపోయిన కోడెల… రిటర్నింగ్ అదికారికి చెప్పి… ఆ సంతకమేదో చేయించుకుని సాయిరెడ్డి నామినేషన్ ను పరిగణనలోకి తీసుకోండి అని సూచించారట.
అంతే… కోడెల చేసిన ఆ ఒక్క సాయంతో సాయిరెడ్డి ఏకంగా పార్లమెంటులోని పెద్దల సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా పదవి చేపట్టారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారులో పరపతిని పెంచుకున్నారు. మోదీ దృష్టిలో పడ్డారు. ప్రదాని చేత పేరు పెట్టి పిచుకునేంతగా ఎదిగారు. అయితే టీడీపీ అధికారం దిగిపోయి… వైసీపీ అధికారం చేపట్టగానే… కోడెలపై రాజకీయ కక్షసాదింపులు మొదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ సారి సాయిరెడ్డితో మాట్లాడొచ్చు కదా అన్న అనుచరుల సలహాతో కోడెల ఆయనకు ఫోన్ చేశారట. అయితే తనకు దాదాపుగా రాజకీయ భిక్ష పెట్టిన కోడెల ఫోన్ ను కూడా సాయిరెడ్డి లిఫ్ట్ చేయలేదట. అంతేనా… తనను కరుణించిన కోడెలపైనే ఘాటు పదజాలంతో సాయిరెడ్డి దూషణల పర్వానికి దిగారు.