వైసీపీ అధినేత జగన్ పాలనా కాలంలో తీసుకువచ్చిన నాడు-నేడు అనే మాట ఇప్పుడు కూటమి సర్కారు చక్కగా వినియోగించుకుంటోందా? ఈ విషయంలో జగన్‌ను వెనక్కి నెట్టేసిందా? ఇక, నుంచి ప్రతి విషయంలోనూ నాడు-నేడుతోనే జగన్‌కు కౌంటర్ ఇవ్వనుందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. వైసీపీ హయాంలో నాడు-నేడు అనే నినాదం భారీగా మార్మోగింది. పాఠశాలలను గత చంద్రబాబు(2014-19) హయాం కన్నా ఎక్కువగా మెరుగు పరిచామని.. గతంలో ఏం చేయలేదో..ఇ ప్పుడు చేసి చూపిస్తున్నామని జగన్ అప్పట్లో చెప్పుకొచ్చారు. దీంతో నాడు-నేడుకు ప్రాధాన్యం పెరిగింది.
అయితే.. అప్పట్లో జగన్ నాడు-నేడును కేవలం విద్యా వ్యవస్థకు మాత్రమే వాడుకుంటే.. ఇప్పుడు కూటమి సర్కారు అన్నింటికీ ముడిపెడుతూ.. సంచలన కామెంట్లు చేస్తోంది. ఒక్క విద్యావ్యవస్థకే కాకుండా.. జగన్ హయాంలో చేసిన ప్రతి పనికీ నాడు-నేడు ను జోడిస్తోంది. దీంతో ఇప్పుడు నాడు-నేడు నినాదం కూటమి పరమైందన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో రహదారుల బాగు చేతను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. 2600 కోట్ల రూపాయలకు పైగానే రోడ్ల మరమ్మతులకు వెచ్చించారు. దీంతో గ్రామీణ, పట్టణ స్థాయిలో రహదారులు అద్దంలా మెరిసిపోతున్నాయి.
ఈ క్రమంలో కూటమి సర్కారు.. నాడు ఎలా ఉన్నాయో.. నేడు ఎలా ఉన్నాయో.. చూడాలంటూ రహదారుల అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. ఇది కూటమి సర్కారుకు మంచి మైలేజీ ఇచ్చే అంశంగా ఉందనిపరిశీలకులు సైతం చెబుతున్నారు. అదేవిధంగా అవినీతి అధికారులను జైళ్లకు పంపించడంతో పాటు.. సక్రమంగా ప్రజలకు అంకిత భావంతో పనిచేసే అధికారులను నియమిస్తున్న తీరులోనూ నాడు-నేడు నినాదాన్ని వాడుతోంది. ఇక, పింఛన్ల పంపిణీలోనూ.. నాడు-నేడు అనే మాట సీఎం చంద్రబాబు నుంచే వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పదే పదే ఈ విషయాన్ని చెబుతున్నారు.
నాడు కేవలం వలంటీర్లువస్తే.. నేడు ప్రజా ప్రతినిధులు కూడా ప్రజల మధ్యకు వస్తున్నారని, సమస్యలు కూడా వింటున్నారని ఆయన చెబుతున్నారు. అదేవిధంగా రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ.. నాడు-నేడు నినాదాన్ని పవన్ కల్యాణ్ సహా మంత్రి నాదెండ్ల మనోహర్ వాడుతున్నారు. జగన్ హయాంలో రైతులు ఎదురు చూపులు చూడాల్సి వచ్చేదని.. ఇప్పుడు పరిస్థితిని మార్చి 48 గంటల్లోనే రైతులకు నగదు చెల్లిస్తున్నామంటూ.. కూటమి నేతలు చెబుతున్నారు. ఇలా అనేక విషయాల్లో మున్ముందు.. నాడు-నేడు నినాదాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇకపై ఈ నినాదం కూటమికి కాపీరైట్‌గా మారే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.