‘తిరుగుబాటు’ సూత్రధారి ‘వెండి’ కొండేనట

తెలంగాణలోని అదికార కాంగ్రెస్ లో తిరుగుబాటు బావుటా ఎగిరిందని, ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ అయ్యారన్న వార్తలు శనివారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ భేటీ జరిగిన మాట వాస్తవమేనని శనివారానికే తేలిపోయింది. ఈ బేటీకి వెండి కొండ అని జనమంతా చెప్పుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నేతృత్వం వహించారట. ఈ మాటను అనిరుధ్ రెడ్డి మాటలే చెప్పేశాయి. ఈ భేటీపై భారీ ఎత్తున ప్రచారం జరుగుతుండగా… ఆదివారం స్వయంగా అనిరుధ్ బయటకు వచ్చారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ భేటీ గురించి ఆయనే పూర్తి వివరాలు వెల్లడించారు.

హైదరాబాద్ లోని ఓ హోటల్ లో తాము 8 మంది ఎమ్మెల్యేం భేటీ అయిన మాట వాస్తవమేనని అనిరుధ్ చెప్పారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించిన ఆయన…ఒకే పార్టీ ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలం అయినంత మాత్రాన తాము ప్రత్యేకంగా భేటీ కాకూడదా? అని కూడా ప్రశ్నించారు. తాము స్నేహపూర్వకంగానే భేటీ అయ్యామని ఆయన చెప్పారు. ఈ భేటీలో రాజకీయ అంశాలను కూడా చర్చించుకున్నామని కూడా ఆయన తెలిపారు. తమను ఇబ్బందులకు గురి చేస్తున్న అంశాలపై చర్చించుకోకుండా ఎలా ఉంటామని కూడా ఆయన ప్రశ్నించారు.

అంతటితో ఆగని అనిరుధ్.. తనపై రెవెన్యూ మంత్రి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఏదో ఫైల్ తీసుకుని రెవెన్యూ మంత్రి వద్దకు వెళ్లినట్లుగా మంత్రితో పాటు పార్టీ సీనియర్ నేత మల్లు రవి చెబుతున్నారన్నారు. తాను ఏ ఫైల్ తీసుకుని వెళ్లానో రెవెన్యూ మంత్రి, మల్లు రవి వెల్లడించాలని అనిరుధ్ డిమాండ్ చేశారు. త్వరలోనే ఈ వ్యవహారంపై పార్టీ ఇంచార్జీ దీపాదాస్ మున్షీని కలుస్తానని… ఆ తర్వాత అన్నీ బయటపెడతానని తెలిపారు. ఎవరి చరిత్ర ఏమిటో అందరికీ తెలుసునన్న అనిరుధ్… మంత్రి గారి చరిత్రను కూడా బయటపెడతానని సంచలన కామెంట్ చేశారు.