తెలంగాణలో ‘తిరుగుబాటు’ కలకలం

తెలంగాణలో శనివారం ఒక్కసారిగా పెను కలకలమే రేగింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగినట్లుగా భావిస్తున్న ఓ కీలక భేటీ ఈ కలకలానికి కారణమైంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాలుపంచుకున్నారని తొలుత వార్తలు వినిపించినా… ఆ తర్వాత ఈ భేటీలో పాల్గొన్నది 8 మంది ఎమ్మెల్యేలేనని తేలింది. వీరంతా కూడా రేవంత్ సర్కారుపై తిరుగుబావుటా ఎగురవేసేందుకే భేటీ అయ్యారన్న వార్తలు నిజంగానే కలకలం రేపుతున్నాయి.

అధికార కాంగ్రెస్ లో పెను కలకలం రేపిన ఈ వార్తలతో అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఇటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు. రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ కాగా.. మహేశ్ కుమార్ భేటీలో పాలుపంచుకున్న ఎమ్మెల్యేలతో ఫోన్ సంభాషణల్లో మునిగిపోయారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి గానీ…ఇలా ప్రత్యేకంగా, రహస్యంగా భేటీలు ఏమిటని ఎమ్మెల్యేలను మహేశ్ నిలదీసినట్లుగా సమాచారం. తమ భేటీ విషయం ఇంత త్వరగానే బయటపడిపోవడంపై ఎమ్మెల్యేలు కూడా ఒకింత ఒత్తిడికి గురవుతున్నట్లుగా తెలుస్తోంది.

అసలు ఈ భేటీకి కారణంగా నిలిచిన వివరాల్లోకి వెళితే… ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ యువ ఎమ్మెల్యే ఈ భేటీకి నేతృత్వం వహించినట్లుగా సమాచారం. భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యేలంతా…సీఎం రేవంత్ టార్గెట్ గా ఏమీ భేటీ కాలేదట రేవంత్ కేబినెట్ లోని ఓ మంత్రి స్వైర విహారం చేస్తున్మనారని.. సదరు మంత్రి కారణంగా, తమ నియోజకవర్గాల్లో తమకు తెలియకుండానే చాలా పనులు జరిగిపోతున్నాయన్నది ఈ ఎమ్మెల్యేల వాదనగా తెలుస్తోంది. ఆ మంత్రిని కట్టడి చేసే దిశగా ఎలాంటి వ్యూహం అమలు చేయాలన్న దిశగా చర్చించుకునేందుకే వీరంతా భేటీ అయ్యారని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్… పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఒకింత ఊపిరి పీల్చుకున్నారు.త్వరలోనే సీఎం రేవంత్ తో ప్రత్యేకంగా భేటీ ఏర్పాటు చేస్తానని మహేశ్ కుమార్ హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యేలు కూడా ఒకింత సంతోషం వ్యక్తం చేసినట్టు సమాచారం.