రేవంత్ కు షాకా?…ప్రీ ప్లానేనా?

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు తెర లేసిన సంగతి తెలిసిందే. ఏపీలో ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి హడావిడి కనిపించడం లేదు. ఎందుకంటే ప్రతిపక్షం బలహీనంగా ఉండటం… ఎన్నికలు జరిగే మూడు స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులే విజయం సాధించడం దాదాపుగా ఖాయమైపోయింది. అయితే తెలంగాణలో అలా కాదు,. అధికారంలో ఉన్నది ఒకే పార్టీ అయినా కూడా ఆ పార్టీలో సీటును ఆశిస్తున్న వారి సంఖ్య వందల్లో ఉంది. అంతేకాకుండా గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ లో నిత్యం వర్గపోరు సాగుతూనే ఉంటుంది కదా. ఫలితంగా విపక్షాల నుంచి అంతగా పోటీ లేకున్నా… కాంగ్రెస్ లో నెలకొన్న టికెట్ల పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న వేం నరేందర్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు. అయితే ఆయనను చట్టసభల్లోకి రప్పించి తన కేబినెట్ లోకి తీసుకోవాలన్నది రేవంత్ వ్యూహం. రేవంత్ మాదిరే నరేందర్ రెడ్డి కూడా గతంలో టీడీపీలోనే కొనసాగారు. ఇంకా చెప్పాలంటే… రేవంత్ కంటే ఆయన సీనియర్ కూడా. రేవంత్ కష్టాల్లో ఉన్న సమయంలో నరేందర్ రెడ్డి ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. ఈ క్రమంలో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా ఓటుకు నోటు కేసు సమయంలో ఆత్మీయ బంధంగా మారిపోయింది.

ఇప్పుడు తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కదా. వాటిలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానం కూడా ఉంది. ఈ స్థానం నుంచి నరేంరద్ రెడ్డిని నిలబెట్టి ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని రేవంత్ భావించినట్టుగా కథనాలు వినిపించాయి. అందుకనుగుణంగానే శనివారం ఈ స్థానం నుంచి వి. నరేందర్ రెడ్డి పోటీ చేయనున్నట్లుగా ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. వి.నరేందర్ రెడ్డి అంటే వేం నరేందర్ రెడ్డే అని అంతా అనుకున్నారు కూడా. అయితే ఈ వి.నరేందర్ రెడ్డి… వేం నరేందర్ రెడ్డి కాదట. ఆల్ ఫోర్స్ విద్యాస్థంస్థల అధినేత అయిన వి.నరేందర్ రెడ్డికి పార్టీ టికెట్ కేటాయించిందట.

ఈ పరిణామం రేవంత్ కు షాకేనని ఆయన అంటే గిట్టని వారు చెబుతున్నారు. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అసలు వేం నరేందర్ రెడ్డిని నిలబెట్టాలని అసలు రేవంత్ అనుకోలేదని ఆయన అనుకూల వర్గం వాదిస్తోంది. మార్చిలో ఎమ్మెల్యే కోటాలో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో బలాబలాల ఆధారంగా చూసుకుంటే… కాంగ్రెస్ హీనపక్షం రెండు సీట్లు ఈజీగా దక్కుతాయి. వాటిలో ఒకదానిని వేం నరేందర్ రెడ్డికి ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారట. ఎమ్మెల్యే కోటా అయితే ఈజీ విన్…అదే గ్రాడ్యుయేట్ బరి అయితే విజయం ఒకింత కష్టమే. ఇవన్నీ ఊహించే రేవంత్ వ్యూహాత్మకంగానే వేం నరేందర్ ను ప్రస్తుత బరిలో నిలపలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.