ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు… కూటమి నేతలకు బాబు సూచన

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 16347 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అయితే, అనుకోకుండా గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆ పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేయడంలో కాస్త జాప్యం జరిగింది. ఈ క్రమంలోనే ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెంటనే 16347 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. రాత్రికి రాత్రే అన్ని కార్యక్రమాలు జరుగుతాయని చెప్పడం లేదని, గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలుకు దిశా నిర్దేశం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లపై ఎన్‌డీఏ కూట‌మి భాగ‌స్వామ్య నేత‌ల‌తో టెలీకాన్ఫ‌రెన్స్ సందర్భంగా చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, రాజ‌శేఖ‌ర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాల‌ని కోరారు. ఎన్‌డీఏ ప‌క్షాల‌తో స‌మ‌న్వ‌య స‌మావేశాలు పెట్టుకుని వారితో కలిసి ప‌నిచేయాల‌ని సూచించారు. ఏ ఎన్నిక వ‌చ్చినా సిద్ధంగా ఉండాలని, అన్ని ఎన్నికలలో గెలిచిన‌ప్పుడే సుస్థిర పాల‌న అందించగలమని చెప్పారు. ఎవరూ ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉండొద్దని నేతలకు సూచించారు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు, రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన నేతలు మరింత చిత్తశుద్ధితో పని చేయాలని పిలుపునిచ్చారు.

కూటమి ప్రభుత్వం చేపట్టిన, చేపట్టబోతోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. ఈ 7 నెలల్లో ఇబ్బందులు అధిగమించి సుపరిపాలన వైపు అడుగులు వేస్తున్నామాని అన్నారు. కేంద్రం సాయంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌, రాజధాని అమరావతికి ఆర్ధిక సాయం, పోలవరానికి నిధులు, రైల్వే జోన్‌తో ఇతర డెవలప్మెంట్, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. దాదాపు రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, వాటి ద్వారా 4,10,125 ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.