తెలుగుదేశంపార్టీలోనే కాదు జనాల్లో కూడా ఇదే చర్చ జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి గురించి చంద్రబాబునాయుడు మాట్లాడని రోజు లేదు. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయటమే టార్గెట్ గా పెట్టుకున్న విషయం అర్ధమైపోతోంది. మీడియా సమావేశాలు పెట్టినా, నేతలతో జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించినా చివరకు తనను కలవటానికి వచ్చిన నేతలతో మాట్లాడినా జగన్ గురించే మాట్లాడుతున్నారు.
అసలు జగన్ గురించి ఇంతగా మాట్లాడాల్సిన అవసరం చంద్రబాబుకు ఉందా అన్నదే ప్రశ్న. ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ చేసే ఆరోపణలు, విమర్శలు కాస్త నిర్మాణాత్మకంగా ఉండాలి. ఎక్కడో ఏదో చిన్న ఘటన జరిగినా దానిపై చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి మాట్లాడేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగే గొడవలు జరుగుతునే ఉంటాయన్న చిన్న విషయం చంద్రబాబుకు తెలీదా ? గొడవలను ప్రభుత్వం ఆపలేందన్న విషయం తెలీదా ?
చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో ఓ ఎస్సీ యువకుడు మరణిస్తే దానిపై పెద్ద రాద్దాంతం చేశారు. తీరా జరిగిందేమిటి తన తమ్ముడు అనారోగ్యంతో మరణించినట్లు మృతుడి సోదరుడే చెప్పాడు. తాజాగా రాజధాని ప్రాంతంలో ఓ రైతు మరణిస్తే ఉద్యమంలో ఓ రైతు మరణించినట్లు ట్విట్టర్లో ఆరోపణలు చేశారు. చంద్రబాబు, లోకేష్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని చనిపోయిన రైతు కూతురే చెప్పింది. రాజధాని ఆందోళనలకు తన తండ్రి మరణానికి సంబంధమే లేదని రైతు కూతురు స్వయంగా చెప్పిన తర్వాత వీళ్ళ పరువు పోలేదా ?
గెలుపోటములు రాజకీయాల్లో సహజమన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించాలి. ప్రతిపక్షంగా టీడీపీని ఎలా బలోపేతం చేయాలనే విషయంపై నేతలతో మాట్లాడాలి. తాను చెప్పేది నేతలు వినటం కాకుండా నేతలు చెప్పేది తాను వినే అలవాటు చంద్రబాబు చేసుకోవాలి. అప్పుడే క్షేత్రస్ధాయిలోని లోటుపాట్లు తెలుస్తాయి. పార్టీలోని లోపాలను నిజాయితీగా విశ్లేషించుకోవాలి. అప్పుడే పరిష్కార మార్గాలు కూడా స్పష్టంగా కనబడతాయి. టీడీపీకి ఉన్న అతిపెద్ద బలమేంటంటే క్యాడర్. జనాల్లో తిరిగే, క్యాడర్ తో సంబంధాలున్న నేతలకి ప్రాధాన్యత ఇస్తే పార్టీ దానికదే బలోపేతమవుతుంది. అంతేకానీ 24 గంటలూ జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఉంటామంటే నేతలూ పట్టిచుకోరు, జనాలూ పట్టించుకోరు. జగన్ కు అనవసరంగా చంద్రబాబే ప్రచారం చేస్తున్నట్లవుతుంది తప్ప ఇంకే ఉపయోగం ఉండదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates