కేసీఆర్ దత్తపుత్రిక ఎంగేజ్ మెంట్.. ఎవరు వెళ్లారంటే?

సవతితల్లి చేతుల్లో దారుణ హింసకు గురై.. స్థానికుల అందించిన సమాచారంతో నరకం నుంచి బయటపడిన ఒక అమ్మాయి గుర్తుందా? చావుబతుకుల మధ్య ఉన్న ఆ అమ్మాయిని తన ఇంటికి పిలిపించుకోవటమే కాదు.. ఆమెను తన దత్తపుత్రికగా స్వీకరిస్తున్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటించటం.. ఆమె బాధ్యతల్ని స్వయంగా స్వీకరించటం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఆ అమ్మాయి ప్రత్యూష. సవతితల్లితో పాటు కన్నతండ్రి హింసకు బాధితురాలిగా మారిన ఆమె గురించి తెలిసిన వారంతా అయ్యో అనే పరిస్థితి.

ప్రత్యూష ఉదంతం గురించి తెలిసిన సీఎం కేసీఆర్ చలించిపోవటం.. ఆమె సంరక్షణ బాధ్యతను ఐఏఎస్ అధికారి రఘునందన్ రావుకు అప్పగించారు. అనంతరం ఆమె పర్యవేక్షణ బాధ్యతను మహిళా శిశు సంక్షేమ శాఖ చూస్తుంది. ఐదేళ్లలో ఆరోగ్యంతో పాటు నర్సింగ్ కెరీర్ పూర్తి చేసిన ప్రత్యూష ప్రస్తుతం ఒక ఆసుపత్రిలో పని చేస్తున్నారు. తాజాగా ఆమె తనకు నచ్చిన వ్యక్తితో కొత్త జీవితాన్ని షురూ చేయనున్నారు.

ఆదివారం విద్యానగర్ లోని ఒక హోటలో లో ఎంగేజ్ మెంట్ జరిగింది. ప్రత్యూషకు కాబోయే భర్త రాంనగర్ ప్రాంతానికి చెందిన చరణ్ రెడ్డి. ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న అతనితో పెళ్లి విషయాన్ని సీఎం కేసీఆర్ కు చెప్పటంతో ప్రత్యూషను ప్రగతిభవన్ కు పిలిపించి మాట్లాడారు. ఆమె ఇష్టాన్ని గుర్తించిన కేసీఆర్.. పెళ్లికి ఆనందంగా ఓకే చెప్పేశారు.

ఎంగేజ్ మెంట్ బాధ్యతను సోషల్ వెల్ఫ్ ర్ అధికారులకు అప్పజెప్పారు. పెళ్లికి తాను తప్పనిసరిగా వస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా ప్రత్యూష చెబుతోంది. సీఎం అండతో తానుకోలుకున్నట్లుగా ఆమె చెబుతున్నారు. మొత్తానికి సీఎం దత్తపుత్రిక ఎంగేజ్ మెంట్ సింఫుల్ గా పూర్తి అయ్యిందని చెప్పాలి.