జగన్ విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకుంటుందా ?

గడచిన కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, ముంపు తీవ్రత వల్ల సుమారు రూ. 4450 కోట్ల విలువైన ఆస్తులు, పంటలకు నష్టం జరిగినట్లు రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి నివేదిక పంపింది. తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ జగన్ కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు. వరద సహాయక కార్యక్రమాలు చేపట్టాలన్నా, తిరిగి సాధారణ పరిస్ధితులు రావాలంటే కేంద్రం తక్షణమే రూ. వెయ్యికోట్లు మంజూరు చేయాలంటూ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో నష్టాలను అంచనా వేయటానికి వెంటనే కేంద్ర బృందాలను పంపాలని కూడా కోరారు.

భారీ వర్షాలు, తుపానుల వల్ల ఆస్తి నష్టం జరగటం సహజమైపోయింది. అయితే ఇక్కడే కేంద్రం పాత్ర ఏమిటి అనే సందేహాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే వర్షాలు, తుపానుల వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయటానికే జాతీయ విపత్తుల నివారణ సంస్ధ (ఎన్డీఆర్ఎఫ్) ఉన్నది. ఈ సంస్ధ ద్వారా జరిగిన ప్రాణ, పంటల నష్టాన్ని భర్తీ చేయమని ప్రభుత్వాలు కోరుతుంటాయి. ఇక్కడే ఓ శం కీలకంగా మారుతుంటుంది. అదేమిటంటే జరిగిన నష్టాన్ని భర్తీ చేయటం రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాల మీద ఆధారపడుంటుంది.

తమకు సానుకూలంగా ఉన్న రాష్ట్రాల్లోనో లేకపోతే తమ పార్టీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఏదైనా నష్టాలు జరిగితే కేంద్రం స్పందించే తీరు ఎలాగుంటుంది, ప్రతిపక్షాల ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుందన్నది అందరు చూస్తున్నదే. మరి ఇపుడు కేంద్రప్రభుత్వంతో రాష్ట్రప్రభుత్వానికి మంచి సంబంధాలే ఉన్నయి. నిజానికి అవసరం లేకపోయినా మద్దతు కోరుతున్న కారణంగా పార్లమెంటులో వైసీపీ ఎంపిలు బిజేపీకి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు.

కాబట్టి ఈ అవకాశాన్ని ఆధారంగా చేసుకుని ఇపుడు రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయటానికి జగన్ గట్టిగా కృషి చేయాలి. ఎప్పుడు కూడా నష్టాల అంచనాపై రాష్ట్రం లెక్కలు ఒకతీరుగా ఉంటుంది. కేంద్రం ఇచ్చే నిధుల లెక్క మరోరకంగా ఉంటుంది. కాబట్టి జరిగిన వాస్తవ నష్టాన్ని యథాతధంగా జగన్ కేంద్రం నుండి రాబట్టగలిగితే రాష్ట్రానికి ఎంతో మేలు జరిగినట్లే అనుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో జగన్ కున్న మంచి సంబంధాలు ఏ మేరకు అక్కరకు వస్తాయో చూడాల్సిందే.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)