జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలనుకుంటున్నామని జనసేన నేత కిరణ్ రాయల్ తో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. అయితే, ఆ విషయాలపై ఎవ్వరూ మాట్లాడవద్దని జనసేన హై కమాండ్ చెప్పడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. ఈ క్రమంలోనే తాజాగా జనసేన నేతలకు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అదే తరహాలో కీలక సూచనలు చేశారు. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ మీద రుద్దవద్దని, పార్టీ ఆలోచనలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.
అంతేకాదు, ఎటువంటి వివాదాలు, గొడవల జోలికి వెళ్ళవద్దని, పార్టీ అధిష్ఠానం ఆదేశించిన దాని ప్రకారం చేయాలని ఆదేశించారు. జనసేనలో చేరిన కొందరు నేతలకు కండువా కప్పి ఆహ్వానించిన నాగబాబు వారికి పలు సూచనలు చేశారు. అధికారం చేతిలో ఉందని దుర్వినియోగం చేయకూడదని, ప్రజలకు వీలైనంత మంచి చేసే విషయంపై దృష్టి పెట్టాలని అన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం తప్ప వేరే ఏది తాము ఆశించలేదని గుర్తు చేశారు.
ఇక, జనసేనలో పని చేసే ప్రతి కార్యకర్త అత్యున్నతమైన స్థానానికి వెళ్ళేందుకు పార్టీ అవకాశం కల్పిస్తుందని, ఇక్కడ మా వాడా, మా ఇంటి కుర్రాడా అనేవి ఉండవని చెప్పారు. నిజాయితీగా, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తే పార్టీలో ఉన్నత శిఖరాలకు వెళతారని అన్నారు. స్వలాభం కోసం పార్టీలో చేరితే అటువంటి ఆలోచనలు పక్కనపెట్టాలని, అయితే, నిజంగా అవసరం ఉన్న సమయంలో ప్రభుత్వం తరపున సాయం చేస్తామని జనసేనలో చేరిన వారికి నాగబాబు చెప్పారు. ఏ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని అన్నారు.