వారసత్వ రాజకీయాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అవకాశాలు అందిపుచ్చుకున్నవారే ఏ రంగంలోనైనా రాణిస్తారని, వ్యాపారం, సినిమా, రాజకీయం, కుటుంబం.. ఏ రంగమైనా వారసత్వం అనేది మిథ్య అని చంద్రబాబు చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. లోకేశ్‌కు వ్యాపారం అయితే తేలికని, ప్రజా సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా లోకేశ్ అదే తరహాలో పదవులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడు టర్మ్ లు చేశానని, నాలుగో సారి ఉండకూడదని భావిస్తున్నానని చెప్పారు. ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు టర్మ్ లకన్నా ఎక్కువగా ఉండకూడదు అని ప్రతిపాదన తేవాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. కొత్త కమిటీలో, పొలిట్ బ్యూరోలో చర్చిస్తున్నామని అన్నారు. పార్టీ వేరే వారికి కూడా అవకాశం రావాలని, గ్రామ స్థాయి కార్యకర్త కూడా పాలిట్ బ్యూరో సభ్యుడి స్థాయికి రావాలని చెప్పారు. అయితే, ఈ ప్రతిపాదనపై పార్టీలో పెద్దలు చర్చించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
మంత్రిగా ఉండటం వల్ల రెగ్యులర్ గా పాదయాత్రలు చేయడం కష్టమని, అయితే, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తుంటామని చెప్పారు. అభివృద్ధితో పాటు ఇటు సంక్షేమంపై ఫోకస్ చేశామని అన్నారు. సీఎం చంద్రబాబు అప్పగించిన బాధ్యతను నెరవేర్చేందుకు అహర్నిశలు కష్టపడతానని చెప్పారు. నిబద్ధత గల కార్యకర్తగా తనవల్ల పార్టీకి ఏనాడూ చెడ్డపేరు రాకుండా చూసుకుంటానని తెలిపారు.
సాక్షి పత్రికపై వేసిన పరువు నష్టం దావా కేసులో విచారణ కోసం విశాఖకు వచ్చానని, తన సొంత ఖర్చులతో ఇక్కడ ఉన్నానని తెలిపారు. మంత్రి హోదాలో విశాఖకు వచ్చినా పార్టీ ఆఫీసులో నిద్రించానని, ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అన్నారు. ఈ విషయం తన తల్లి భువనేశ్వరి నుంచి నేర్చుకున్నానని చెప్పారు. ఇది నాలుగో సారి అని, ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని అన్నారు. నిజం తనవైపుందని, ఎప్పటికైనా అది గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.